నెల్లూరు జిల్లా వైసీపీలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఓ వైపు అనం రామ నారాయణరెడ్డి ఇప్పటికే తన హాట్ కామెంట్స్ తో నెల్లూరు నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేయగా..  టీడీపీ కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు. దీంతో కావలి నేతల్లోనూ అసంతృప్తి మొదలైంది. మరోవైపు నెల్లూరు మాఫియాకు అడ్డాగా మారిందన్న ఆనం వ్యాఖ్యలపై మండిపడ్డ జగన్.. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు.

 

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. మొన్నటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు  ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలతో బహిర్గతమైంది. మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలను టార్గెట్‌ చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. ఇంత కాలం అంతర్గతంగా ఉన్న నాయకుల పోరు ఇక రచ్చకెక్కడానికి ఎంతో కాలం పట్టదనే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరికి రండి. ఏ తరహా మాఫియా కావాలన్నా నెల్లూరు నగరానికి వెళ్లండి అంటూ ఆనం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నే రేపాయి.  

 

నెల్లూరులో లిక్కర్‌ మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్‌ మాఫియా, బెట్టింగ్‌ మాఫియా.. పెట్టే బాధలను ఎవరికి చెప్పు కోవాలో అర్థం కాక లక్షలాది మంది నగర ప్రజలు కుమిలిపోతున్నారని ఆనం చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్షంగా మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి పనితీరుపై విమర్శల బాణాలుగా మారాయి. 

 

ఆనం వ్యాఖ్యలతో వైసీపీలో కలకలం మొదలైంది. గత టీడీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆనం వ్యాఖ్యానించి ఉంటారని, జగన్ పాలన పారదర్శకంగా ఉందని మంత్రి అనిల్ చెప్పారు. మరోవైపు విజయసాయిరెడ్డి మాత్రం లైన్ దాటితే.. వేటు తప్పదని హెచ్చరించారు.

 

వాస్తవానికి మంత్రి వర్గ విస్తరణ జరిగిన రోజు నుంచే జిల్లా అధికార పార్టీ నాయకుల మధ్య అంతర్యుద్ధం మొదలయింది. ప్రధానంగా మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డిలకు, మంత్రి అనిల్‌, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒక లే అవుట్‌కు నీటి కనెక్షన్‌ విషయంలో కాకాణి, కోటంరెడ్డిల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. దీనికితోడు మంత్రి అనిల్‌ తన నియోజకవర్గ విషయాల్లో జోక్యం చేసుకొంటున్నారనే ఆరోపణలు కాకాణికి మంత్రి పట్ల అసహనం పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

 
మరోవైపు వీఆర్‌సీ కాలేజీ  వ్యవహారం ఆనంలో ఆగ్రహం కలిగించిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. వీఆర్సీ కాలేజీ పెత్తనం చాలా ఏళ్లుగా ఆనం కుటుంబం చేతిలో ఉంది. అయితే వీఆర్‌సీ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిని నియమించినట్లు మంత్రి అనిల్‌ ప్రకటించారు. ఆనం కుటుంబ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో వెంకటగిరి పరిధిలోని ఆల్తూరుపాడు రిజర్వాయర్‌ నిర్మాణం విషయంలోనూ మంత్రి అనిల్‌ జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలంగా జరుగుతున్న ఈ సంఘటనలు ఆనం రామనారాయణరెడ్డిని, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఒక జట్టుగా, మంత్రి అనిల్‌ను, కోటంరెడ్డిని ఒక జట్టుగా ముద్ర వేసి జనం మధ్య నిలబెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: