నిత్యానందపై రోజుకో కొత్త కేసు నమోదవుతోంది. ఇప్పటికే బాలికల కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న నిత్యానందపై.. ఓ విదేశీ భక్తురాలు కూడా ఫిర్యాదు చేసింది. తన డబ్బు కోట్ల రూపాయలు కాజేశాడని కంప్లైంట్ ఇచ్చింది. మరోవైపు నిత్యానంద కైలాస దేశ ప్రచరం కూడా అబద్ధమేనని తేలింది. 

 

గజకర్ణ, గోకర్ణ,  టక్కు టమార విద్యల్లో నిత్యానంద బాగా ఆరితేరిపోయాడు. కొత్త వివాదం వచ్చినప్పుడల్లా.. దాన్ని తప్పుదోవ పట్టించేలా స్వీయ ప్రచారం చేసుకుని బయటపడటానికి అలవాటుపడిపోయాడు. కానీ ఈసారి మాత్రం ఆ పప్పులు ఉడకలేదు. ఇప్పటికే బాలికల కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందపై ఫ్రాన్స్ దేశానికి చెందిన  భక్తురాలు కంప్లైంట్ చేసింది. దీంతో ఫ్రాన్స్ నిత్యానందపై విచారణ మొదలుపెట్టింది. 

 

ఇటీవల నిత్యానంద ఆశ్రమ సిబ్బంది... యువతుల్ని బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగేందుకు చేసిన ఘనకార్యాలు వెలుగులోకి రావడంతో... ఒకప్పటి నిత్యానంద భక్తులు ఇప్పుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నిత్యానందకు టాప్ రిక్రూటర్ గా ఉన్న సారా లిండే.. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తానంటోంది. ఫ్రాన్స్ భక్తురాలు నిత్యానంద తన దగ్గర నుంచీ నిత్యానంద 2 కోట్ల 85 లక్షలు కాజేశాడని కేసులో తెలిపింది. దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించింది. అయితే నిత్యానంద అనుయాయులు మాత్రం సారా వాటికన్ నాటిన మొక్క అంటూ మరోసారి అందర్నీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

అటు నిత్యానంద కైలాస దేశం కూడా హంబక్కేనని ఈక్వెడార్ ప్రకటించింది. తమ దగ్గర శరణార్థిగా ఉండటానికి నిత్యానంద ఆశ్రయం కోరాడని, కానీ తాము తిరస్కరించామని చెప్పింది. తాము ఎలాంటి భూభాగాన్నీ నిత్యానందకు అమ్మలేదని తేల్చిచెప్పింది. ఆయన ప్రస్తుతం హైతీకి పారిపోయినట్లు అనుమానిస్తోంది. మీడియా వార్తలన్నీ నిత్యానంద వెబ్ సైట్ వండి వార్చిన కథనం ఆధారంగా వచ్చాయని ఈక్వెడార్ తెలిపింది. దీంతో నిత్యానందకు ఇంటర్ పోల్ నుంచి నోటీసు ఇప్పించడానికి సీఐడీని ఆశ్రయించారు పోలీసులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: