అనంతపురరంలో పొలిటికల్  నేతల కామెంట్స్ కాస్తా సామాజికవర్గ రాజకీయాలుగా మారాయి. రెడ్డి వర్సెస్ కాపుగా మారి ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్రంలో ఒక విధమైన రాజకీయానికి తెర లేపారు. ఎన్నికలు లేవు, గొడవలు లేకపోయినా.. కేవలం మాటలతోనే స్టేట్ లో హై ఓల్టేజ్ క్రియేట్ చేస్తున్నారు నేతలు. 

 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు.. లోకల్ బాడీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కాని ప్రస్తుతం పాలిటిక్స్ చూస్తే.. ఎన్నికలప్పుడు కన్నా.. ఎక్కువ హాట్ హాట్ గా మారాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల నుంచి జగన్ ప్రభుత్వంపై టీడీపీ మాటల దాడి చేస్తుండగా.. గత నెల నుంచి వారికి పవన్ కల్యాణ్ తోడయ్యారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు పర్యటిస్తూ.. వైసీపీని స్ట్రాంగ్ గా అటాక్ చేస్తున్నారు. నేరుగా జగన్ ను టార్గెట్ చేసుకుని ఆయన చేస్తున్న కామెంట్స్ పై మంత్రులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. కానీ రాయలసీమలో అత్యంత చల్లటి ప్రాంతమైన హార్స్ లీ హీల్స్ వేదికగా జనసేన రాజేసిన నిప్పు.. ఇప్పుడు రాష్ట్రమంతా పాకుతోంది.

 

హార్స్ లీ హీల్స్ లో అనంతపురం జిల్లా నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించారు. అందులో రాప్తాడు నియోజకవర్గం జనసేన నాయకుడు సాకే పవన్.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశిస్తే.. తాను ప్రకాష్ రెడ్డి తలతో పాటు ఎవరి తలనైనా నరుకుతా అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పవన్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేసినా..ఆయన వాటిని ఖండించలేదు. తాము మేము మాటలు మాత్రమే అన్నాం అంటూ వెనుకేసుకొచ్చారు. 

 

దీనిపై అనంతపురం జిల్లా వైసీపీ నేతలు తీవ్ర రియాక్ట్ అయ్యారు. పలు చోట్ల ఆందోళనలు చేశారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారంటూ తాడిపత్రి, హిందూపురం, కళ్యాణదుర్గంలలో ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై ప్రకాష్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించేందుకు చంద్రబాబునాయుడే ఇలా మాట్లాడిస్తున్నారని అన్నారు. దీనిపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయితే దీనిని రెడ్డి సంఘం తీవ్రంగా తీసుకుంది. ప్రతి దానికి రెడ్లను కౌంటర్ చేస్తే జనాసేనాని సీమలో అడ్డుకుంటామంటూ  హెచ్చరిస్తున్నారు.

 

జనసేన అధినేత పై రెడ్డి సంఘం మండిపడటంతో ఇటు కాపు సంఘం నేతలు కూడా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.  కాపులనుద్దేశించి రెడ్డి సోదరులు ఫేస్ బుక్, వాట్సాప్ లలో ఇష్టమొచ్చినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా పవన్ తో ఎలాంటి విభేదాలు ఉంటే చూసుకోవచ్చుగాని.. ఇందులోకి కాపు కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. పవన్ అడ్డం పెట్టుకుని కులాన్ని తిడితే ఊరుకునేది లేదన్నారు. దీనిపై కాపులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

ప్రస్తుతానికి రాయలసీమలో ఎలాంటి ఫ్యాక్షన్ గొడవలు లేవు. పోలీసులు సమర్థవంతంగా పని చేస్తుండటంతో అలాంటి వాటికి ఆస్కారం లేదు. కాని ఇప్పుడు నేతలు కులాల ప్రస్తావన తీసుకొచ్చి.. తలలు నరుకుతామంటూ వ్యాఖ్యలు చేయడం, దీనిని పవన్ సమర్థించడం పై ఇప్పుడు గొడవలకు దారి తీస్తోంది. దీనిపై ఇటు రెడ్డి, అటు కాపుసంఘాల స్పందించి మరింత ఆజ్యం పోస్తున్నారు. దీంతో ఇది స్టేట్ లో సరికొత్త రాజకీయాలను సృష్టిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: