నేరస్థుల ఎన్‌కౌంటర్‌కు సరైన కారణాలుంటే.. ఫర్వాలేదు! కానీ ఒకవేళ అది ఫేక్‌ అని తేలితే పరిస్థితి ఏమిటి? ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు చిక్కుల్లో పడ్డట్లేనా? 2014 నాటి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ఏం చెబుతున్నాయ్‌? సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో 8 ఏళ్లపాటు జైలులో ఉన్న అధికారి ఎవరు? 

 

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌తో పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కానీ ఇలాంటి ఎన్‌కౌంటర్లకు సరైన కారణాలున్నా.. ఆత్మరక్షణ కోసం కాల్పులకు పాల్పడిన పోలీసులపై విధిగా కేసు నమోదు చేయాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. ఈ విషయంలో 2014లోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. 16 అంశాలతో ఒక గైడ్‌లైన్స్‌ను కూడా రూపొందించింది అత్యున్నత న్యాయస్థానం. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు.. అంతకుముందు అందిన సమాచారం పక్కాగా నోట్‌ చేయాల్సిందే. సీనియర్‌ అధికారి నేతృత్వంలో CID దర్యాప్తు జరిపించాలి. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి పోస్టుమార్టం మొత్తం వీడియో తీయాలి. 

 

ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఒకవేళ ఎన్‌కౌంటర్‌ ఫేక్‌ అని తేలితే మాత్రం పోలీసులు చిక్కుల్లో పడ్డట్లే. కొన్ని ఎన్‌కౌంటర్లు పొలిటికల్‌ కలర్‌ కూడా తీసుకున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవే ఇస్రత్‌ జహాన్‌.. సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్లు.  2004లో ఇస్రత్‌ జహాన్‌, 2005లో సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీరిలో ఇస్రత్‌ జహాన్‌పై లష్కరే ఉగ్రవాదిగా ఆరోపణలు వచ్చాయి. సొహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై మొత్తం 21 మంది పోలీసులపై కేసు నమోదైంది. వీరిలో డి.ఐ.జి ర్యాంక్‌ అధికారి డి.జి వంజార కూడా ఉన్నారు. వంజారతోపాటు అనేక మంది పోలీసులు దాదాపు 8 ఏళ్లపాటు జైలులో ఉన్నారు. 

 

కేసు తుది తీర్పు ఏమైనా.. అన్నేళ్లపాటు పోలీసులు ఖాకీ యూనిఫామ్‌కు దూరమయ్యారు. ఉద్యోగంలో ఉన్న ఠీవీ వేరు.. ఆరోపణలతో జైలు ఉండటం వేరు. ఇది అధికారుల మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది.  అది కుటుంబంపై కూడా ఉంటుంది. కేసు కొలిక్కి వచ్చే వరకూ పదోన్నతులు ఉండవు. 

 

ఇక ముంబైలో అండర్‌వరల్డ్‌ డాన్‌లను హడలెత్తించిన ఇన్‌స్పెక్టర్‌ దయానాయక్ దాదాపు 83 మందిని ఎన్‌కౌంటర్‌ చేశారు. చివరకు అదే అండర్‌వరల్డ్‌ డాన్‌లతో లింకులు ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. తర్వాతి కాలంలో ఆ ఆరోపణలు రుజువు కాలేదు. తిరిగి యూనిఫామ్‌ వేసుకున్నా.. కుదురుగా ఒకచోట డ్యూటీ చేయలేని పరిస్థితి. 

 

నేరస్థుల ఎన్‌కౌంటర్‌ జనాలకు సంతోషాన్నిచ్చినా.. కాల్పుల్లో సరైన కారణాలున్నా.. ఘటనలో పాల్గొన్న ఖాకీలకు అప్పటి నుంచే కష్టాలు మొదలవుతాయి. అందుకే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు పైకి చిరునవ్వులు చిందించినా.. లోలోన కేసు భయం వెన్నాడుతూనే ఉంటుంది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారమే కాల్పలు జరిగితే ఖాకీలకు వచ్చిన ఇబ్బందేమీ ఉండబోదు. గైడ్‌లైన్స్‌ అమలులో ఏ మాత్రం పొరపాట్లు ఉన్నా.. ఖాకీ కాస్తా ఖైదీగా మారాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: