దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంట‌ర్‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు కొన‌సాగుతున్నాయి. ఓ వైపు  జాతీయ మానవహక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ) బృందం విచారణ ప్రారంభించ‌గానే...మ‌రోవైపు నిందితుల కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. శుక్రవారమే తెలంగాణ పోలీసులకు నోటీసులిచ్చిన హక్కుల సం ఘం.. శనివారం ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ పంపించింది. ఈ బృందం స‌భ్యులు కూల‌కంషంగా ఎన్‌కౌంటర్ గురించి అధ్య‌య‌నం చేస్తున్న త‌రుణంలోనే..మ‌రోవైపు దిశ నిందితుల కుటుంబసభ్యులు ఆందోళ‌న చేశారు. నారాయణపేట జిల్లా గుడిగండ్లలోని అంతరాష్ట్ర రహదారిపై ఆందోళన చేశారు. కోర్టుతీర్పు రాకుండానే తమ వారిని చంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులు వారిని సముదాయించి ఇళ్ల‌కు పంపారు.

 


కాగా, ఎన్‌హెచ్చార్సీ బృందం నేరుగా మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానకు వెళ్లి అక్కడి మార్చురీలో నిందితుల మృతదేహాలను పరిశీలించింది. ఈ బృందం వెంట వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలను పరీక్షించి, ఎక్కడెక్కడ బుల్లెట్‌గాయాలున్నాయి. ఇతర గాయాల వివరాలను నమోదుచేసుకొన్నారు. నిబంధనల మేరకు పోస్ట్‌మార్టం నిర్వహించారా అన్న విషయాన్ని పరిశీలించారు. వీడి యో ఫుటేజీని తిలకించారు. హెచ్చార్సీ సభ్యు లు దవాఖాన సూపరింటెండెంట్‌తో స‌హా హైదరాబాద్ గాంధీ దవాఖాన ఫోరెన్సిక్ బృందం నుంచి వివరాలను సేకరించారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురి మృతదేహాలకు నిబంధనలమేరకు పోస్ట్‌మార్టం నిర్వహించినట్టు గాంధీ వైద్యశాల ఫోరెన్సిక్ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ కృపాల్‌సింగ్ తెలిపారు. ఈ బృందంలో గాంధీ వైద్యశాలకు చెందిన ఫోరెన్సిక్ వైద్యులు మహేందర్, లావణ్యతోపాటు మహబూబ్‌నగర్ ఫోరెన్సిక్ వైద్యుడు నర్సింహ ఉన్నారు.

 


మ‌రోవైపు మహబూబ్‌నగర్ దవాఖానలో మృతదేహాల పరిశీలన అనంతరం హెచ్చార్సీ బృందం చటాన్‌పల్లికి చేరుకున్నది. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని అడిగి ఎన్‌కౌంటర్‌పై వివరాలను తెలుసుకున్నది. తర్వాత దిశను నిందితులు కాల్చిన ప్రదేశం, ఘటన జరిగిన తొండుపల్లి టోల్‌ప్లాజా ప్రాంతాన్ని సందర్శించింది. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్లకు వెళ్లి మృతుల కుటుంబసభ్యులతో బృందం మాట్లాడనున్నది. సోమవారం హైదరాబాద్‌లో ఉండి మరిన్ని అంశాలపై దర్యాప్తు చేయనున్నట్టు సమాచారం.ల‌

మరింత సమాచారం తెలుసుకోండి: