ఢిల్లీలో నిర్భయ.. హైదరాబాద్ లో దిశ, హన్మకొండలో మానస, ఆసిఫాబాద్ లో అపరిచిత.. ఒక్కరా.. ఇద్దరా.. మానవ మృగాల భారిన పడి పడతులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏజెన్సీలో నుంచి మెట్రోస్ వరకు అత్యాచారాలు హత్యోదంతాలు మహిళ భద్రత ను ప్రశ్నిస్తున్నాయి. అయితే దిశ కేసులో సత్వర న్యాయం జరగడంతో అపరిచితకు సైతం అదే న్యాయం చేయాలంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. 

 

సంచార జీవనం వారి బతుకుదెరువు. భర్తతో కలిసి ఊరు ఊరు తిరిగి పిన్నులు, బెలూన్స్ అమ్మి పొట్టపోసుకునే కుటుంబం చిన్నాభిన్నం అయింది. మహిళ పై పశువాంఛ తీర్చుకున్న దుండగులు.. ఆ తర్వాత అటవీ ప్రాంతంలో కిరాతకంగా హతమార్చారు. అపరిచిత గత నెల ఇరవైన నాలుగున భర్త గోపి తో కలిసి వివిధ రకాల వస్తువులు అమ్మేందుకు వెళ్లింది. వీరిది నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లె. కానీ జీవనం కొనసాగించడం కోసం వీరు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఉంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న చిన్న పిన్నులు, చిక్కెంట్రుకలు, అదేవిధంగా బెలూన్స్ అమ్ముకోవడం కోసం గూడేల్లో తిరిగే వారు. వారికి ఇద్దరు కుమారులు. గతనెల 24న లింగూపూర్ మండల కేంద్రంలో భర్త బైక్ మీద అపరిచితను దింపి వేరే గ్రామానికి వెళ్లాడు. ఆమె ఇదే మండలంలోని ఎల్లపటార్ శివారులోకి వెళ్లగానే మాటు వేసిన ముగ్గురు దుండగులు ఆమెను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత చేతులు, మెడపై కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. 
అదే రోజు తన భార్య అదృశ్యం కావడం తో పోలీసులను ఆశ్రయించాడు భర్త. అప్పటి నుంచి వెతకగా  25తేదిన అడవిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆతర్వాత రోజు కో రూపంలో నిరసనలు కొనసాగుతున్నాయి. అదే నెల 27న గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.  

 

ఈ క్రమంలో దిశ హత్య జరగడం.. దానిపై దేశం మొత్తం దృష్టి పెట్టడంతో.. ఈ కేసు మరుగునపడింది. దిశ హత్య నిందితులను ఉరితీయాలంటూ మహిళ లోకం గర్జించింది. పోలీసులు సీన్ రీకనస్ట్రక్షన్ కోసం తీసుకెళ్లగా అక్కడ జరిగిన ఎదురు కాల్పులలో నలుగురు నిందితులు హతమయ్యారు. దీంతో అసిఫాబాద్ లో ఆందోళనలు మళ్లీ మొదలయ్యాయి. అపరిరచిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నాలకు దిగుతున్నారు. 


 
హత్య జరిగిన జైనూర్ మండలంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు  స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుండగా, ఆదివాసి, దళిత సంఘాలు తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఎక్కడికక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ అపరిచితకు న్యాయం చేయాలని, నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ తో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అపరిచిత స్వగ్రామమైన గోసంపల్లెలో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.  దిశ ఘటనలో నిందితులను ఎలాగైతే ఎన్కౌంటర్ చేశారో అలాగే అపరిచిత నిందితులను సైతం ఎన్ కౌంటర్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ప్రజాప్రతినిధులు తిరిగి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

అపరిచిత కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ ను స్థానికులు నిలదీశారు. సంఘటన జరిగి పదమూడు రోజులు గడిచినప్పటికీ పరామర్శకు ఇన్ని రోజుల తర్వాత రావడమేంటని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ఎక్కువ సేపు సమయం ఇవ్వకుండా కుటుంబ సభ్యులను పరామర్శించి వెనుదిరిగారు. అపరిచిత హత్యతో ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు.  తమ తల్లిని చంపిన వాళ్లను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు చిన్నారులు. తమ కుటుంబానికి  న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు అపరిచిత భర్త. 

 

అపరిచిత కేసులో నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత పోలీసులు తీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. జిల్లా పోలీస్ లు ఏంచేస్తున్నారనే ప్రశ్నలు రావడంతో.. కేసు విచారణ లో వేగం పెంచారు. అపరిచిత కుటుంబాన్ని ఆదుకున్నామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అపరిచిత కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్ పెండింగ్ లో ఉంది. ఇప్పటికే పోలీసులు నిందితుల్ని కస్టడీలోకి తీసుకొని విచారించారు.

 

 

ADB GROUND.txt
Displaying ADB GROUND.txt.

మరింత సమాచారం తెలుసుకోండి: