దిశను అతికిరాతకంగా మానభంగం చేసి కాల్చేసిన నిందితులు నలుగురిని ఎన్ కౌంటర్ లో హతమార్చిన పోలీసు బృందాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నెత్తిన పెట్టుకుంటున్నారు. అంతకుముందు దిశ కనపడకుండా పోయినప్పుడు తన కుటుంబ సభ్యులు వచ్చి వారికి ఫిర్యాదు చేసినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిపై తిట్ల దండకం అందుకున్న వారే ఇప్పుడు పూల వర్షం కురిపిస్తున్నారు. అయితే నలుగురు నిందితుల కుటుంబసభ్యులు ఇది ఎన్ కౌంటర్ కాదని... తమకు చట్టపరంగా న్యాయం జరగాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఎన్ కౌంటర్ పైన విచారణ జరిపేందుకు ఒక కమిటీ ని నియమించింది.


అయితే నిన్న సాయంత్రం మృతదేహాలను పోస్టుమార్టం చేసిన తరువాత వచ్చిన నివేదిక చూసినవారంతా ఒక రేంజ్ లో ఆశ్చర్యపోయారు. పోలీస్ వారు చెప్పిన దాని ప్రకారం నిందితులైన నలుగురు వారి దగ్గర ఉన్న గన్నులు లాక్కొని దాడి చేయడంతో.... తామంతా ఆత్మ రక్షణకై తప్పించుకొని పారిపోతున్న నేరస్థులపై తిరిగి కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే పోస్టుమార్టం నుండి వచ్చిన రిపోర్టు ప్రకారం నిందితుల మృతదేహాలలో ఏ ఒక్కరి లోనూ ఒక తుపాకీ తూటా కూడా లభించలేదు. పోలీసులు మొత్తం 11 రౌండ్లు కాల్పులు జరపగా ఒక్క బుల్లెట్ కూడా కనీసం ఒక్కరి శరీరంలో కూడా లభించకపోవడం ఏమిటని ఇక్కడ అందరి ప్రశ్న.


సరే వారు కాల్చిన బుల్లెట్లు హై కాలిబర్ గన్నుల నుండి వచ్చినవి కావడం వలన అవి వారి శరీరంలో నుండి దూసుకుని బైటకు వచ్చి ఎక్కడో పడిపోయి ఉంటాయి అనుకుందాం. అసలు వారి శరీరంలో నుండి బయటికి వచ్చేస్తే ఎంత దగ్గర నుండి పోలీసులు కాల్చి ఉంటే వారిని కాల్చే బదులు వెంటనే వారిని పట్టుకోవచ్చు కదా అని ఇక్కడ ఇంకొక అనుమానం వస్తుంది. పైగా కాల్చిన గాయాలన్నీ నిందితులకి ముందు వైపు నుంచి ఉండడం కూడా కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇది ఎన్ కౌంటర్ కాదు పక్కాగా ప్లాన్ చేసిన హత్య అని తెలిస్తే మాత్రం పోలీసులు కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: