ఈరోజు ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీ ఉలిక్కిపడింది, ఢిల్లీలో ని అనాజ్ మండి ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఈ ఘటనలో ఇప్పటివరకు 56 మంది మరణించారు. రెస్క్యూ, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చాలా మందిని రక్షించారు, ఇంకా చాలా మంది తీవ్రంగా మంటల్లో కాలిపోయారు.  

 

ఈ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య భారీగా ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. తాజా సమాచారం ప్రకారం ఈ అగ్ని ప్రమాదంలో 56 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం అందుతోంది. మంటలను అదుపులోకి తేవడానికి, సహాయక చర్యలకు 30 కి పైగా ఫైర్ ఇంజన్లను ఘటన స్థలికి తరలించారు. అగ్ని ప్రమాదం గురించి తమకు ఉదయం సమాచారం వచ్చిందని, కాలిపోతున్న భవనంలో ఎంతమంది వ్యక్తులు చిక్కుకున్నారో ఎటువంటి సమాచారం లేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు, దీనివల్ల సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి అని అగ్నిమాపక శాఖాధికారులు తెలిపారు.

 

ఆసుపత్రికి తీసుకువచ్చిన చాలా మంది మరణించినట్లు ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. రక్షించిన చాలా మందిని ఆర్‌ఎంఎల్ హాస్పిటలుకు తరలించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశంలో భాదితుల బంధువులు, స్థానికుల ఆర్తనాదాలతో భీతావహ దృశ్యాలు నెలకొన్నాయి. వివిధ కర్మాగారాల్లో పనిచేసే కార్మికులతో ఈ భవనం నిండిపోయిందని అధికారులు తెలిపారు, సామర్ధ్యానికి మించి భవనాల్లో కార్మికులను ఉంచడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. పోలీసులు భవన యజమాని కోసం వెతకడం ప్రారంభించారు.

 

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, సిఎం అరవింద్ కేజ్రీవాల్, బిజెపి నాయకులు మనోజ్ తివారీ, అనురాగ్ ఠాకూర్ అనాజ్ మండి లోని మంటలు సంభవించిన ప్రదేశానికి చేరుకున్నారు. మంటల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ .10 లక్షలు, గాయపడిన వారికి రూ .1 లక్షల పరిహారం ప్రకటించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ప్రధాని మోదీ ఈ ప్రమాదాన్ని అతిభయంకరమైన ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన అన్నిరకాల సహాయక కార్యక్రమాల్ని అధికారులు చేపడుతున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: