జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా మారిపోతే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తు...  ప్రజల మధ్య పర్యటిస్తూ ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అసలు సిసలయిన రాజకీయనాయకుడిగా మారిపోయారు. ఇక జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కంటే ఎక్కువగా విమర్శలు  చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు  ఆయన. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెలగతోడు లో రైతులతో సమావేశమై వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. నేతలు ఎన్నికల ముందు ఓట్ల కోసం పాదయాత్రలు చేశారని రైతుల కన్నీళ్లు తుడవడానికి ఇప్పుడు పాదయాత్రలు  అవసరమంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

 


 ఒకప్పుడు రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజల్లో తిరగాలి అని ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రైతుల కన్నీటి తో కూడిన రక్తపు కుడు  తింటున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతుల అందరికీ న్యాయం జరిగే వరకు తన పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. రైతుల ఆవేదన తనకు తెలుసునని రైతుల సమస్యలపై లోతుగా విశ్లేషణ చేసి సమస్యలను తీర్చేందుకు ప్రణాళికలు వేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు నిజాలు చెప్తే చంపేస్తామంటూ రైస్ మిల్లర్ల ను వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరించారని జిల్లాలో పర్యటన చేస్తున్న అని తెలియగానే వైసిపి ప్రభుత్వానికి భయం పట్టుకుంది అంటూ వ్యాఖ్యానించారు. 

 


 రైతులను సమస్యలకు గురి చేసిన ఏ ప్రభుత్వము కూడా నిలవలేదని... రైతుల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వమైనా కాలి పోవాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. రైతుల సమస్యలు తెలుసుకుని రైతులకు అండగా ఉండటానికి తాను వస్తున్నానని తెలిసి రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన 87 కోట్ల ను రాత్రికి రాత్రి ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన అన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం అవుతుందని తెలిపారు. గతంలో పండించిన పంటకు ధర రావడం లేదంటూ క్రాఫ్ హాలిడే పెట్టారు అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్... అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలోని రైతులందరికీ కన్నీరే మిగిలిందని.. ప్రభుత్వం చెప్పిన మాటలు నీటి మూటలు అయ్యాయంటూ  పవన్ కళ్యాణ్ అన్నారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: