ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలన మతమరమైన కోణంలో సాగుతుందని విమర్శలు వస్తున్నాయి. మొదట ఆర్టీసీ టికెట్లపై మత ప్రచారం జరిగిందని వార్తలు వినిపించాయి. ఆ టికెట్లు గత ప్రభుత్వ హయాంలోనే ముద్రించారని వైసీపీ నాయకులు సమాధానం ఇచ్చారు. ఆ తరువాత అన్యమత ప్రచారానికి సంబంధించిన వార్తలు వినిపించాయి. 
 
కొన్ని రోజుల క్రితం విజయవాడలోని పున్నమిఘాట్ దగ్గర మత మార్పిళ్లు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదాలను మరవకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రజలు నిత్యావసర వస్తువులు తీసుకునే రేషన్ కార్డులపై ఏసు క్రీస్తు, వెంకటేశ్వర స్వామి బొమ్మలను ముద్రించడం వివాదానికి కారణమైంది. తూర్పు గోదావరి జిల్లాలోని వడ్లమూరులో ఒక రేషన్ షాపు యజమాని వెంకటేశ్వర స్వామి బొమ్మలను, ఏసు క్రీస్తు బొమ్మలను కార్డులపై చిత్రీకరించారు. 
 
రేషన్ కార్డులపై మత ప్రచారం జరుగుతూ ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్యమత ప్రచారం జరగటం లేదని ఖండించినప్పటికీ ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తూ ఉండటం గమనార్హం. ఇలాంటి ఘటనల్లో తప్పు ఎవరిదైనా అంతిమంగా ప్రభుత్వంపైనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 
 
మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై వైసీపీ జెండా రంగులు పూయడం గురించి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఆఫీసులకు, సాయిబాబా దిమ్మెకు, గాంధీ విగ్రహం దిమ్మెకు వైసీపీ పార్టీ రంగులు పూయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాలన పరంగా ప్రజలను ఆకట్టుకుంటున్నా అన్యమత ప్రచారం, వైసీపీ పార్టీ రంగులు పూయడం గురించి ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇతర పార్టీల నేతలు ప్రభుత్వంపై అన్యమత ప్రచారం, రంగుల విషయంలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: