మరో 23 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రజలకు కొత్త సంవత్సరం వార్నింగ్ అంటూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. 2020 జనవరి నెల నుండి ఏటీఎంలలో 2,000 రూపాయల నోట్లు దొరకవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 1,000 రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకొనిరాబోతుందని ఆ మెసేజ్ సారాంశం. 2019 సంవత్సరం డిసెంబర్ నెల 31వ తేదీ వరకే 2,000 రూపాయల నోట్లు చెల్లుబాటు అవుతాయని త్వరగా మార్చేసుకోవాలని సోషల్ మీడియాలో మెసేజ్ వైరల్ అవుతోంది. 
 
ఒక వ్యక్తి 50,000 రూపాయల వరకే బ్యాంకులలో 2,000 రూపాయల నోట్లను మార్చుకునే వీలు ఉంటుందని అంతకుమించి మార్చుకోవటం వీలు కాదని జనవరి నెల 2020 నుండి 2,000 రూపాయల నోట్లు చెల్లవని తెలుస్తోంది. ఆర్బీఐ అధికారులు గతంలోనే 2,000 రూపాయల నోటు రద్దు అయ్యే అవకాశం లేదని చెప్పారు. కొందరు ఈ మెసేజ్ లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేస్తుంటే మరికొందరు మాత్రం నరేంద్రమోదీ ప్రభుత్వం 2,000 రూపాయల నోట్లను రద్దు చేసినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. 
 
రాజ్యసభలో 2,000 రూపాయల నోట్ల రద్దు గురించి ప్రశ్నకు మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ 2,000 రూపాయల నోట్లను రద్దు చేస్తామనడంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. 2 వేల రూపాయల నోట్ల రద్దు గురించి వస్తున్న వార్తలు రూమర్లు మాత్రమే అని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2,000 రూపాయల నోట్ల రద్దుకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని అన్నారు. 
 
ఆర్బీఐ వెబ్ సైట్ ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం 2016 సంవత్సరంలో నోట్ల రద్దు చేసిన విషయం తెలిసిందే. 500,1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తరువాత ప్రభుత్వం 2,000 రూపాయల నోట్లను అందుబాటులోకి తెచ్చింది. అప్పటినుండి నోట్ల రద్దుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: