దేశ రాజధాని ఢిల్లీ లో నేడు జరిగిన ఒక ఘోర అగ్ని ప్రమాదంలో 48 మందికి పైగా అగ్నికి ఆహుతి అయ్యారు. వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని ఝాన్సీ మార్గంలోని అనాజ్ మండి ప్రాంతంలోని ఒక కర్మాగారంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అగ్ని కీలలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. వాస్తవానికి ఝాన్సీ మార్గం అంతా ఎక్కువగా మూసి ఉండడంతో అక్కడి ప్రజలు తప్పించుకోవడానికి పెద్దగా వీలు లేకుండా పోయిందని తెలుస్తోంది. అక్కడి స్థానికులు అందించిన సమాచారం మేరకు వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గురైన భవంతిలో విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువు అధికంగా ఉన్నట్టు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గుర్తించడం జరిగింది. 

 

మూడు, నాలుగు అంతస్తుల్లో ఎక్కువగా విష వాయువులు ఉండటంతో, ఊపిరాడక చాలా మంది కార్మికులు చనిపోయారని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ భవంతిలో చాలా కిటికీలను పూర్తిగా మూసివేశారని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఆ సమయంలో వీలైనంత ఎక్కువమందిని కాపాడడానికి ప్రయత్నించాం అని, అయితే అప్పటికే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా ప్రజలు భయాందోళనలతో కొద్దిపాటి తొక్కిసలాట కూడా జరిగినట్లు చెప్తున్నారు. కాగా కొన్నేళ్ల క్రితం 1997లో జరిగిన అగ్నిప్రమాదం తరువాత ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఈ ప్రమాదం అతి పెద్దదని, ప్రస్తుతం తాము కాపాడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు చెప్తున్నారు. 

 

అయితే ఈ ఘటనలో 11 మందిని ఎంతో ధైర్యంగా ముందుకు నడిచి కాపాడిన ఫైర్ మ్యాన్ రాజేష్ శుక్లను అందరూ అభినందిస్తున్నారు. ప్రమాద ఘటన విషయం తెలిసిన అనంతరం అక్కడికి చేరుకోగానే రాజేష్ తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వారిని కాపాడాడని, కాగా ఆ సమయంలో అతడికి కొద్దిపాటి గాయాలయ్యాయని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఇప్పటికే పూర్తిగా మంటలను అదుపుచేసిన అగ్ని మాపక సిబ్బంది, పూర్తిగా కాలిపోయిన వారిని కూడా తక్షణమే ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇక ఈ దుర్ఘటనలో చనిపోయిన వారికి ఢిల్లీ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ను ప్రకటించింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: