’క్రమశిక్షణ లేని జనసైనికుల వల్లే నేను ఓడిపోయాను’

’క్రమశిక్షణ లేకపోవటం వల్లే జనసేన మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది’

 

ఇది తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసైనికులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నపుడు పవన్ కు ఒక్కసారిగా ఆవేశం వచ్చేసింది. ఎందుకంటే పవన్ చెబుతున్న మాటలు జనసైనికులు వినకుండా ఒకటే తప్పట్లు, ఈలలు, గోల చేశారు. దాంతో అధినేతకు కోపం వచ్చేసింది. అందుకనే జనసైనికులకు క్రమశిక్షణ లేదని మండిపడ్డారు. అంటే జనసైనికులకు శ్రమశిక్షణ లేదని పవన్ ఒప్పేసుకున్నారు.

 

క్రమశిక్షణ లేని జనసైనికుల వల్లే తాను ఓడిపోయినట్లు పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలో క్రమశిక్షణ లేకపోవటం వల్లే ఇబ్బందులు వస్తున్నట్లు మండిపోయారు. జనసైనికలకు గనుక క్రమశిక్షణ ఉండుంటే ఎన్నికల్లో జనసేన తప్పకుండా  గెలిచుండేదే అనటమే ఆశ్చర్యంగా ఉంది.

 

నిజానికి జనసైనికులలో క్రమశిక్షణ లేదన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ ను ఫాలో అవుతున్న జనాలను చూసిన ఎవరికైనా  ఈ విషయం అర్ధమైపోతుంది. ఎందుకంటే పవన్  సభలకు హాజరయ్యేవాళ్ళు, రోడ్డు షోల్లో పాల్గొంటున్నవాళ్ళల్లో ఎక్కువమంది కేవలం అభిమానులు మాత్రమే అన్న విషయం అందరికీ తెలుసు.

 

కేవలం సినీ అభిమానుల వల్లే ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి రాదన్న విషయం పవన్ కు తెలియకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రజారాజ్యంపార్టీ పెట్టి సోదరుడు చిరంజీవి చేతులు కాల్చుకున్న విషయం చూసిన తర్వాత కూడా పవన్ లో జ్ఞానోదయం కలగకపోవటమే విచిత్రం.

 

ఏ రాజకీయ పార్టీ కూడా మధ్య తరగతి వర్గాన్ని ఆకట్టుకున్నపుడే గెలుపు అవకాశాలు పెరుగుతాయి. దానికి తోడు పార్టీకంటూ నికరంగా ఓటు బ్యాంకుంటుంది. ఈ విషయం కూడా తెలియని పవన్ కేవలం అభిమానులు, కాపు సామాజికవర్గాన్ని మాత్రమే నమ్ముకున్నారు. వాస్తవానికి పవన్ అభిమానుల్లో చాలామందికి  అసలు ఓటు హక్కే లేదు.

 

దానికి తోడు కాపుల్లో కూడా ఎక్కువమంది జగన్మోహన్ రెడ్డికే మద్దతుగా నిలిచారు. మామూలు జనాలతో పాటు కాపులను ఆకట్టుకోవటంలో పవన్ ఫెయిలయ్యారు. నిజాలు ఇలా ఉంటే పవన్ మాత్రం జనసేన అధికారంలోకి రాకపోవటానికి కారణం జనసైనికుల్లో క్రమశిక్షణ లేకపోవటమే అని చెప్పటం ఆడలేక మద్దెల ఓడన్నట్లే ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: