మంత్రులకే జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకిచ్చారనే చెప్పాలి. ఇకనుండి ప్రభుత్వ పథకాల ప్రచారంలో మంత్రుల ఫొటోలు ముద్రించవద్దని జగన్ ఆదేశాలిచ్చారు. పథకం ఏదైనా కానీండి ఇకనుండి కేవలం ముఖ్యమంత్రి ఫొటో మాత్రమే వాడాలని ఉన్నతాధికారులతో పాటు కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటనల విషయంలో గతంలో  సుప్రింకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని జగన్ కూడా స్పష్టం చేశారు.

 

నిజానికి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు విస్తృత ప్రచారం చేసుకోవటం మామూలే. శాఖలవారీగా ప్రకటనలు ఇచ్చే సమయంలో కూడా సిఎంతో పాట ఆయా శాఖలకు సంబంధించిన మంత్రుల ఫొటోలను కూడా వాడుతుంటారు. మామూలుగా ఈ విషయాలు మొత్తాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ చూసుకుంటుంది. కొన్నిసార్లు ఆయా శాఖలే సొంతంగా ప్రకటనలు కూడా జారీ చేసేస్తుంటాయి.

 

సరే విషయం ఏదైనా ఇకనుండి జగన్ ఫొటో తప్ప మరే మంత్రి ఫొటో కనిపించే అవకాశం లేదు. ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రుల ఫొటోలు వాడవద్దని సుప్రింకోర్టు ఆదేశాలున్నా ఏ ప్రభుత్వం కూడా పెద్దగా పాటిస్తున్న దాఖలాల్లేవు. మొన్నటి వరకూ జగన్ ప్రభుత్వం కూడా పాటించలేదు. కానీ కారణాలు తెలియటం లేదుకానీ హఠాత్తుగా జగన్ తీసుకున్న నిర్ణయంతో మంత్రులకు షాక్ తగిలినట్లయింది.

 

తొందరలో అంటే రానున్న మార్చి నెలలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరగబోయే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు తర్వాత జరిగే పంచాయితీ ఎన్నికల ప్రకటనల్లో  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలు వాడటం సహజం.

 

అలాగే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బొత్సా సత్యనారాయణ పొటోలు వాడుతుంటారు. కానీ తాజా నిర్ణయం ఫలితంగా పై మంత్రులిద్దరి ఫొటోలు కనబడవు. నిజానికి ప్రకటనల్లో మంత్రుల ఫొటోలుండటం వల్ల వాళ్ళకు అదనంగా వచ్చే ఉపయోగాలేమీ లేవు. కానీ అదో హోదా చిహ్నంగా మారిపోయింది. ప్రకటనల్లో ఫొటోలు లేవన్న కారణంగా నేతల మధ్య ఎన్నో గొడవలు జరిగిన ఘటనలున్నాయి. జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక ఫొటోల గొడవలుండవనే అనుకుందాం.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: