దళపతి.. రజినీకాంత్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమా.. ఈ సినిమాలో సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ ప్రాణం. అంత బాగా కుదిరింది. అయితే మళ్లీ ఆ తరవాత సంతోష్ శివన్ ఎన్ని సినిమాలు చేసినా రజినీకాంత్ తో మాత్రం కుదరలేదు. మళ్లీ 29 ఏళ్ల తర్వాత ఆ కాంబినేషన్ దర్బార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

 

ఇదే విషయంపై చిత్ర ద‌ర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన సంతోషం పంచుకున్నారు. ఆయన ఏమన్నారంటే.. “ సంతోశ్‌శివ‌న్‌గారితో ర‌జ‌నీకాంత్ కాంబినేష‌న్ అంటే ద‌ళ‌ప‌తి సినిమానే గుర్తుకు వ‌స్తుంది. 29 ఏళ్లకు ఈ కాంబినేష‌న్‌ను నేను డైరెక్ట్ చేయ‌డం ఆనందంగా ఉంది. నాకు ఊహ తెలిసి మా ఊరిలో థియేటర్ లో నేను చూసిన హీరో రజినీకాంత్‌గారే. ఆయనతో సినిమా తీయడం సంతోషంగా ఉంది. ఆయన మనకు దొరికిన వరం. దేవుడ్ని నమ్మినవాడు కష్టపడతాడు నిజాయితీగా ఉంటాడు అని నమ్మే వారిలో ఆయన ఒకరు.

 

రజినీకాంత్ ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన జీవితమనే పెద్ద నౌకలో నేను ఏడాదిపాటు ట్రావెల్ చేయ‌డం గ‌ర్వంగా అనిపిస్తుంది. నయనతార, నివేదా థామస్, యోగిబాబు, సునీల్ శెట్టిగారు ఇలా అందరూ పాత్రలు చాలా బాగుంటాయి. `కత్తి` సినిమా స‌మ‌యంలో సుభాస్కర‌న్‌గారితో సినిమా చేశాను. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌పై చాలా విమ‌ర్శలు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఆయ‌నే త‌మిళ సినిమాకు ఓ పిల్లర్‌లా త‌న వంతు స‌పోర్ట్ అందిస్తున్నారు.

 

`క‌త్తి` త‌ర్వాత ఆయ‌న నిర్మాణంలో `ద‌ర్బార్‌` చేయ‌డం ఆనందంగా ఉంది. అనిరుద్ చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. ఎడిట‌ర్ శ్రీకర్ ప్రసాద్‌గారు ఓ స‌న్నివేశాన్ని చూసిన‌ప్పుడు కేవ‌లం ఎడిటింగ్ మాత్రమే చేయ‌కుండా సన్నివేశాన్ని ఎన్‌హెన్స్ చేయ‌డానికి ఏం చేయాల‌నే సూచ‌న‌లు ఇస్తారు. అలాగే యాక్షన్ స‌న్నివేశాలు ఓ ఎమోష‌న్‌తో ఉంటాయి. రామ్‌లక్ష్మణ్‌గారు, పీట‌ర్ హెయిన్స్‌గారు అద్భుతమైన యాక్షన్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేశారు. గ‌త 15 ఏళ్ల‌లో రజినీకాంత్‌గారిని ప్రేక్షకులు చూడని విధంగా యాక్షన్ సన్నివేశాలుంటాయి`` అన్నారు మురుగదాస్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: