ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ ఆరు నెలల పాలన వైఫల్యాలపై గళమెత్తాలని నిర్ణయం తీసుకోగా వైసీపీ పార్టీ టీడీపీ ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేలా సిద్ధమైందని తెలుస్తోంది. ఈరోజు జరగబోయే బీఏసీ సమావేశంలో శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
 
వైసీపీ పార్టీ ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టబోతుందని సమాచారం. దాదాపు 20 అంశాలపై ప్రభుత్వం ఈ సమావేశాల్లో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మహిళల భద్రతకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఏసీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కనీసం 14రోజులైనా సమావేశాలను నిర్వహించాలని పట్టుబట్టనుందని తెలుస్తోంది. 
 
తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఇసుక ధర విపరీతంగా పెరిగిపోవడం, ఉల్లి ఇతర నిత్యావసరాల ధరల పెరుగుదల, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, సంక్షేమ పథకాల్లో కోత, రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను నిలిపివేయటం, ఉపాధీ హామీ పథకం, వాలంటీర్ల నియామకంలో అక్రమాలు, మీడియాపై ఆంక్షల జీవో, హౌసింగ్ బిల్లుల పెండింగ్ గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు సన్నద్ధమై రావాలని ప్రజల తరపున గళం వినిపించాలని సూచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రతి రోజు ఒక సమస్య గురించి నిరసన కార్యక్రమాలను చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేసిందని సమాచారం. సీఎం జగన్ సభలో పూర్తి ఆధిపత్యం చాటాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలపై, నవరత్నాలపై ఫోకస్ చేసి తెలుగుదేశం పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. వెంకటపాలెంలో ఎన్టీయార్ విగ్రహానికి నివాళులర్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరు కానున్నారు. ఉల్లి ధరలపై నిరసనగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కాలినడకన అసెంబ్లీకి వెళ్లనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: