ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులు పాటు జరుగనున్న ఈ సమావేశాలు అధికార, ప్రతిపక్షాలు తమ ప్రశ్నలు, సమాధానాలతో సిద్ధమయ్యాయి. వైసీపీ ప్రభుత్వం కొలువుదీరాక జరుగుతున్న రెండో అసెంబ్లీ సమావేశాల్లో అనేక సమస్యలు ప్రస్తావనకు రానున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజధానిపై విపక్షం పట్టుబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ సిద్ధమైంది. ఇటీవల జరిగిన అనేక పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి.

 

 

ప్రధానంగా జమ్మూకాశ్మీర్ లో స్వయంప్రతిపత్తి రద్దు చేసాక ఇటీవల విడుదల హోంశాఖ విడుదల చేసిన కొత్త మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని పేరు లేకుండా రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీఎం స్పందించలేదని టీడీపీ ఆగ్రహించింది. టీడీపీ ఎంపీలు హోంశాఖతో మాట్లాడి అమరావతి పేరు చేర్చి కొత్త మ్యాప్ విడుదలయ్యేలా చేసింది. మంత్రి బొత్స కూడా రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఇదంతా స్మశానంలా ఉంది, ఒక్క ఇటుక కూడా పెట్టలేదు, రాజధానికి అనువైన ప్రదేశం కోసం నిపుణులతో కమిటీ.. ఇలా రాజధాని అంశం ప్రముఖంగా నిలిచింది. పైగా టీడీపీ ఇటీవల రాజధాని పర్యటనలు అంటూ మూడు కార్యక్రమాలు చేపట్టింది. మాజీ మంత్రుల బృందం పర్యటన, చంద్రబాబునాయుడు పర్యటన, అఖిలపక్ష భేటీ.. ఇలా టీడీపీ ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది.

 

 

అయితే.. సీఎం జగన్ ఇటీవల రాజధానిపై ఓ ప్రకటన చేశారు. రాజధానిలో పనులు ఆపొద్దు.. అని. దీంతో అమరావతిపై చిన్న కదలిక వచ్చిందనే చెప్పాలి. కానీ.. టీడీపీ మాత్రం సీఎం నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వంపై మొదటి రోజు నుండే టీడీపీ ఎదురుదాడికి సిద్ధమైందని సమాచారం.  గత సమావేశాలకు ధీటుగా ఈసారి సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: