తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీకేజ్ సంభవించింది. సఖినేటిపల్లి మండలం కేసుదాసుపాలెంలోని ఇళ్లకు సమీపంలోనే గ్యాస్ లీకేజీ జరగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద శబ్దంతో గ్యాస్ లీక్ కావటాన్ని గుర్తించిన గ్రామస్థులు ఓఎన్జీసీ ఆధికారులకు సమాచారం అందించారు. ఓఎన్జీసీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని గ్యాస్ లీకేజీని అదుపు చేశారు. 
 
ఓఎన్జీసీ పైప్ లైన్లు 30, 40 సంవత్సరాల కిందటి పైప్ లైన్లు అని తెలుస్తోంది. పాత పైప్ లైన్లు కావటంతో లీకేజీలు తరచుగా సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్డు పక్కనే ఉన్న పైప్ లైన్ నుండి పెద్ద శబ్దంతో లీకేజీ ప్రారంభం అయిందని పెద్ద పెద్ద శబ్దాలతో గ్యాస్ లీకేజీ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రెండు గంటల పాటు పైప్ లైన్ నుండి గ్యాస్ లీకేజీ జరిగిందని తెలుస్తోంది. 
 
గతంలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ కావటంతో 23 మంది మృతి చెందారు. ఓఎన్జీసీ అధికారులు స్థానికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రెండునెలల క్రితం మల్కిపురం మండలం తూర్పు పాలెంలో గ్యాస్ లీక్ కావడంతో గ్రామస్థులు భయాందోళన చెందారు. తుప్పుబట్టిన పైప్ లైన్ ల కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఓఎన్జీసీ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
గ్యాస్ లీకేజీల సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు హడలిపోతున్నారు. ఓఎన్జీసీ పైప్ లైన్లు లీక్ అవుతూ ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం గుప్పిట్లో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని స్థానికులు బ్రతుకుతున్నారు. తమ పరిస్థితి అధికారులకు పట్టటం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలతో స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని, అధికారుల వైఖరిపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: