సంచ‌ల‌న తుది నిర్ణ‌యం వెలువ‌డింది. దేశ‌వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌ వ్యాప్తంగా కూడా సంచ‌లనం సృష్టించిన నిర్భ‌య ఘ‌ట‌న‌లో నిందితుల‌కు ఉరితీయ‌డం ఖ‌రారైంది. నిందితుల‌కు క‌ఠిన శిక్ష అమ‌లు చేసేందుకు రాష్ట్రప‌తి సైతం ఓకే చెప్పేందుకు సిద్ధ‌మ‌వ‌డం మ‌రోవైపు...ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర హోంశాఖ వేగంగా ఆయా ప్ర‌క్రియ‌ల‌ను పూర్తి చేసేయ‌డంతో...క్ష‌మాభిక్ష పిటిష‌న్‌పై రాష్ట్రప‌తి తుది నిర్ణ‌యం కంటే ముందే...వారిని ఉరితీయ‌డం ఖాయ‌మైంది. డిసెంబర్ 16న ఉదయం 5 గంటలకు ఆ దుర్మార్గుల‌కు ఉరి వేయ‌నున్నారు.

 


2012 డిసెంబర్ 16న దేశ రాజధాని ఢిల్లీలో ఓ వైద్యవిద్యార్థిని (23)పై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్‌సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేళ్ల‌ శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. మిగతా నలుగురు.. ముకేశ్(29), వినయ్ శర్మ (23), పవన్ (22), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ నలుగురు దోషులకు ట్రయల్ కోర్టు మరణశిక్షను విధించగా, 2014 మార్చి 13న ఢిల్లీ హైకోర్టు ఆ శిక్షను సమర్థించింది. 

 


అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. 2017, మార్చి 27న తుది వాదనలు విని ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేస్తూ మే 5వ తేదీన తుది తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తులు ఢిల్లీ హైకోర్టు తీర్పును ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే,  నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన నిందితుల్లో ముగ్గురు అసలు క్షమాభిక్షను కోరలేదు. వినయ్ శర్మ ఒక్కడి పేరుతోనే అప్లికేషన్ రావడంతో శిక్షల అమలు పెండింగ్ లో పడింది. హైదరాబాద్ లో దిశ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వినయ్ శర్మ పిటిషన్ ను రిజెక్ట్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయాన్ని సమర్థిస్తూ శుక్రవారమే కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి రికమెండ్ చేసింది. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందే వినయ్ శర్మ పిటిషన్ ను వెనక్కి తీసుకోవడంతో దుర్మార్గుల‌కు ఉరిశిక్ష ఖ‌రారైంది. ఈనెల 16న వారు తుది శ్వాస విడ‌వ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: