ఉల్లిపాయల ధరలు, సరఫరా, నియంత్రణ తదితర అంశాలపై అసెంబ్లీలో జరిగిన చర్చ చివరకు చంద్రబాబునాయుడు మెడకే చుట్టుకుంది. చూడబోతే సొంత సంస్ధ హెరిటేజే చివరకు చంద్రబాబుకు షాకిచ్చినట్లు అర్ధమైపోతోంది. రాష్ట్రంలో ఉల్లిపాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయంటూ టిడిపి ఎంఎల్ఏలు గోల మొదలుపెట్టారు. ఉల్లి ధరలు పెరిగిపోతున్నా ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నట్లు మండిపడ్డారు.

 

టిడిపి ఎంఎల్ఏల ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి గట్టి సమాధానమిచ్చారు. మహారాష్ట్రలోని షోలాపూర్ నుండి ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఉల్లపాయలను కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందిస్తున్నట్లు వివరించారు. రైతు బజార్లలో కేజి ఉల్లిపాయలను 25 రూపాయలకే అందిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశం మొత్తం మీద తమ ప్రభుత్వం ఒకటే అన్నారు.

 

అవకాశం ఉన్నంతలో ఉల్లిపాయలను బయట రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి జనాలకు సబ్సిడి ధరలకే అందిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఉల్లిపాయల ధరలు పెరిగిపోతున్నట్లు ఆందోళన చేస్తున్న చంద్రబాబు సొంత  సంస్ధ హెరిటేజ్ లో ఉల్లిపాయల కేజి ధర ఎంతుంది ? అంటూ నిలదీశారు. హెరిటేజ్ సంస్ధలో కేజి ఉల్లిపాయలను 200 రూపాయలకు అమ్ముతున్న చంద్రబాబు ఉల్లిపాయల ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేయటంలో అర్ధం లేదన్నారు.

 

ఇదే విషయమై మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి కూడా మాట్లాడుతూ జనాలకు ఉల్లిపాయలను తక్కువ ధరలకే అందించటానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో  చంద్రబాబు మాత్రం తన హెరిటేజ్ సంస్ధలో ఉల్లిపాయలను కేజి 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ నిలదీశారు.

 

ఉల్లిపాయల ధరల గురించి ఆందోళన చేస్తున్న చంద్రబాబు తన సంస్ధలో  కిలో ఉల్లిని 25 రూపాయలకే ఎందుకు అందించటం లేదని ప్రశ్నించారు. సొంత సంస్ధ లాభాల్లో ఉండాలని ఆలోచిస్తున్న చంద్రబాబు రైతు బజార్లలో సబ్సిడి ధరలకే ఉల్లిపాయలు అందిస్తున్న ప్రభుత్వం కృషిని ఎందుకు గుర్తించటం లేదంటూ నిలదీశారు. జగన్, బుగ్గన ప్రశ్నలకు చంద్రబాబు నుండి మామూలుగానే నోరు లేవలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: