ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న అంశం ఉల్లిపాయల కొరత. ఎంతగా అంటే గతంలో ఎన్నడూ లేనంతగా కిలో 150కి చేరిపోయింది. ఈ ధరలు సామాన్యులకు మాత్రమే కాదు.. ఉన్నత వర్గాలకు కూడా ఇబ్బందే. ఉల్లి పంట తక్కువగా ఉండడం, పక్క రాష్ట్రాలకు ఎగుమతులు.. వెరసి ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఏపీ ప్రభుత్వం రైతు బజార్లలో రూ.25కే కేజీ ఉల్లిని అందిస్తోంది. ఎక్కడ ఏ రైతు బజార్ ను చూసినా ప్రజల క్యూలైన్లే కనపడుతున్నాయి. విచారించే విషయం ఏంటంటే క్యూ లైన్లలో నిలబడి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. మరికొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు.

 

 

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మూడేళ్ళ క్రితం పెద్ద నోట్ల రద్దు సమయం గుర్తు రాక మానదు. నోట్ల రద్దు అంశం దేశాన్నే కుదిపేసింది. ఎక్కడ ఏ ఏటీఎం చూసినా చాంతాడంత క్యూలు. ఈ క్యూ లైన్లలో నిలబడి దేశం మొత్తం మీద ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం ఉల్లి కోసం కూడా ఇదే జరుగుతోంది. ఉల్లి కోసం క్యూలైన్లలో నిలబడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజు రాయితీ ఉల్లి కోసం గుడివాడ రైతుబజారు వద్ద  జనం బారులు తీరిన సమయంలో.. క్యూలైన్‌లో వేచి ఉన్న సాంబయ్య అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా సాంబయ్య మృతి చెందారు. ఇటీవలే ఇటువంటి మరో సంఘటన కూడా జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉల్లి సమస్య తీవ్రమవుతోంది.

 

 

ఇప్పటికే ప్రభుత్వం ఉల్లిపై రాయితీ ఇస్తోంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో ఎగుమతులు నిలిపేసింది. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని సేకరిస్తోంది. ఉల్లి పంట తక్కువకావడమూ ఇబ్బందులు తెచ్చింది. మరో వైపు నాణ్యమైన ఉల్లి సేకరణ చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధరలు కొంత అదుపులోకి వచ్చాయి. ఎప్పటికి ఈ సమస్య పరిష్కారమవుతుందో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: