అధికారంలో ఉన్న ఏ ప్ర‌భుత్వంపైన అయినా వాటి త‌ప్పుల‌ను ఎంచ‌డానికి ప్ర‌తిప‌క్షాలు, మీడియా ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తాయి. కానీ అదే ప్ర‌భుత్వం చేసిన త‌ప్పును స‌రిదిద్దుకున్న‌ప్పుడు, అది కూడా దుర్వినియోగమయ్యే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేసేలా పొరపాటు సరిదిద్దుకున్నప్పుడు కూడా అవే ప్రతిపక్షాలు, మీడియా ఆ నిర్ణయాన్ని అభినందించడం నైతిక ధర్మం. లోపం సరిచేసుకున్నా కాకుల్లా పొడవడం విజ్ఞుల లక్షణం కాదు. మార్పును ఆశించే సమాజంలో, దాని కోసం ప్రయత్నించేవారిని ప్రోత్సహించడం అందరి ధర్మం. కానీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వాతావరణం కనిపించడం లేదు. విమర్శలు, ఆరోపణలన్నీ రాజకీయ కోణంలోనే చూడటమే విచారకరం. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ విషయంలోనూ అదే జరుగుతోంది.

 

జగన్ సీఎం కాకముందే తాడేపల్లిలో ఇల్లు నిర్మించుకున్నారు. ఎన్నికల ముందే గృహప్రవేశం చేశారు. అది ఆయన సొంత ఖర్చుతో నిర్మించుకున్న ఇల్లు. సీఎంగా ఎన్నికయిన తర్వాత సహజంగా అదే సీఎం క్యాంపయిపోతుంది. అదీగాక వివిధ కారణాలతో జగన్ సచివాలయానికి పెద్దగా వెళ్లడం లేదు. ఎక్కువ శాతం ఆయ‌న ఇంటి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. సీఎం రోజూ సచివాలయానికి రావాలన్న నిబంధనేమీ లేదు. కాకపోతే అధికారులు అక్కడే కొలువుతీరతారు కాబట్టి పరిపాలన, సమయ సౌలభ్యం కోసం ప్రతి సీఎం సచివాలయానికి తప్పనిసరిగా వెళుతుంటారు. ఈ సంప్రదాయం కొన్నేళ్ల నుంచి చూస్తున్నదే. ఆ మాటకొస్తే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అసలు సచివాలయానికే వెళ్లరు. ప్రగతిభవన్ నిర్మించకముందు వరకూ, తన ఫాంహౌస్ నుంచే కార్యకలాపాలు సాగించారు. దానిపై వచ్చిన విమర్శలు వేరే విషయం.

 

అయితే జగన్ సీఎం అయిన తర్వాత తాడేపల్లి లోని తన క్యాంపు ఆఫీసులో వివిధ సౌకర్యాలు, సందర్శకుల సౌకర్యం కోసం కోట్ల విలువైన పనులు అధికారులు ప్రతిపాదించారు. దానిని ఆర్‌అండ్‌బి నిర్వహిస్తుంటుంది. నిధులు కూడా ఆ శాఖనే మంజూరు చేస్తుంది. సహజంగా సీఎం నివాసాలకు ఈవిధంగా పనుల కోసం నిధులు మంజూరు చేయడం చాలా ఏళ్ల నుంచి ఒక సంప్రదాయంగా వస్తోంది. అందుకు జగన్ మినహాయింపుకాదు. గతంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంపు ఆఫీసు, హైదరాబాద్‌లోని నివాసం, శేరిలింగంపల్లి ప్రాంతంలోని ఫాంహౌస్‌కు రోడ్డు, ఇతర నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దానిపై ఎన్నో విమర్శలొచ్చినా, జగన్ మాదిరిగా వాటిని రద్దు చేయలేదు.

 

తాజాగా జగన్ తాడేపల్లి క్యాంపు ఆఫీసు కోసం ఆర్ అండ్ బి ఇచ్చిన ఆరు ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం చర్చనీయాంశమయింది. అల్యూమినియం కిటికీలు, తలుపులు, ఫర్నీచర్, ఎయికూలర్లు, విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుతోపాటు, హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ఇంటికి అదనపు సౌకర్యాలు, రక్షణ కోసం ఆ ఆరు ఉత్తర్వులు గతంలో ఇచ్చారు. తాజాగా వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. గతంలో ఏపీని అర్ధరాత్రి పూట చీల్చారని చంద్రబాబు తరచూ మాట్లాడేవారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది వెలువరించడానికి పగలయినా, రాత్రయినా ఒక్కటే. ఇదీ అంతే! రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుని, ఉద్యోగుల జీతాలకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో, ఇంత దుబారా అవసరమా అన్న విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే, ఈ జీఓలు రద్దు చేస్తున్నారన్నట్లుగా జరుగుతున్న ప్రచారం చూడటానికి రోత. నిజానికి గతంలో చంద్రబాబు కూడా కోట్ల రూపాయలతో సౌకర్యాలు ఏర్పాటుచేసుకున్నారు కాబట్టి, తాను చేసుకుంటే తప్పేమిటని వైసీపేయులు ఎదురుదాడి చేస్తే ఎవరివద్దా సమాధానం ఉండదు. నిజానికి తన క్యాంపు ఆఫీసు, హైదరాబాద్ లోని తన నివాసానికి కోట్ల రూపాయలతో అదనపు హంగులు ఏర్పాటు చేస్తున్న విషయం, సీఎంగా ఉన్న జగన్‌కు తెలిసే ఉండవచ్చు. దాన్ని కాదనలేం. కానీ అంత దుబారా ఎందుకన్న భావనతో కావచ్చు, ఇతరులకు ఆదర్శంగా ఉందామన్న లక్ష్యంతో కావచ్చు, లేదా తనకు ప్రభుత్వ సొమ్మెందుకన్న లెక్కలేనితనం కావచ్చు. గతంలో చంద్రబాబు నివాసాలకు కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినయోగం చేశారని తానే ఆరోపించినందున.. ఇప్పుడూ తానూ అదే పనిచేస్తే, తనకూ-బాబుకూ తేడా లేకుండా పోతుందన్న రాజకీయ వ్యూహం లేదా నైతిక కారణాలూ కావచ్చు. కారణాలేమైనా తన ఇంటి కోసం ఇచ్చిన ఉత్తర్వులను, రద్దు చేసినందుకు ఆయనను అభినందించి తీరాలి.అంటే జగన్‌లో మార్పు వచ్చినందుకు సంతోషించాలి. అలాకాకుండా, దానిని కూడా విమర్శించి రంధ్రాన్వేషణ చేయడమే స్థాయి త క్కువ వ్యవహారంగా కనిపిస్తోంది. మనిషిలో మార్పు రావాలని ఓవైపు కోరుకుంటూ, దానినే డిమాండ్ చేస్తున్న వారు.. జగన్‌లో వస్తున్న మార్పును ఆహ్వానించి, అభినందించ కపోవడం దౌర్భాగ్యం. ఇది ఒకరకంగా భావదారిద్య్రమే.

 

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి దానికీ ప్రత్యేక విమానాలు వాడుతున్నారంటూ ధ్వజమెత్తిన జగన్.. ఇప్పుడు సీఎంగా తానూ అదే పని చేస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. సాధారణ ప్రయాణీకుల మాదిరిగా, లేదా బిజినెస్‌క్లాస్‌లో వెళ్లకుండా, ప్రత్యేక విమానాల్లో వెళుతున్న చంద్రబాబు ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా ఖర్చు పెడుతున్నారని, సభలో కూడా దుయ్యబట్టారు. కానీ సీఎం అయిన తర్వాత జగన్ కూడా, గతంలో బాబు మాదిరిగానే ప్రత్యేక విమానాల్లో వెళుతుండం బట్టి.. ఇద్దరికీ తేడా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి దుబారా అవుతుందన్న ముందుచూపుతో తన ఇంటి కోసం ఇచ్చిన ఆరు జీవోలను రద్దు చేసినట్లుగానే, దుబారాను తగ్గించేందుకు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం మానేయడం ద్వారా.. ఆదర్శంగా నిలుస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: