ఏపీలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. నేటి నుంచి ప్రారంభమయిన అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాల గురించి మాట్లాడింది సర్కార్. ఆంధ్రప్రదేశ్‌లో 2020 జనవరిలో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 7900 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి సురేష్ ప్రకటన చేశారు. మొత్తానికి చూస్తే డీఎస్సీ కోసం ఇన్ని రోజులుగా వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తేనని చెప్పుకోవచ్చు.


మంత్రి ఆదిమూలపు సురేష్ మెగా డీఎస్సీని నిర్వహిస్తామని ప్రకటించారు. 7900 పోస్టులతో డీఎస్సీ ఉంటుందని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో (జనవరి 2020) నిర్వహిస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ పై మంత్రి ప్రకటనతో ఏపీ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇంకా రాబోయే రోజుల్లో వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని వచ్చే జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని అయన పేర్కొన్నారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉంచే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. జనవరి నెల సమీపిస్తున్నందున నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పుడు చెప్పినట్లుగానే మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్నారు.


ప్రస్తుతం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ఉద్యోగాల భర్తీ చేపడుతోందని అధికారులు తెలిపారు. గ్రామ వాలంటీర్, వార్డ్ వాలంటీర్, గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు అంగన్‌ వాడీ, ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దీంతో నిరుద్యోగులకు వరుసగా శుభవార్త అందిస్తోంది. తాజాగా మెగా డీఎస్సీ ప్రకటనతో నిరుద్యోగులు ఆనందంతో ఉన్నారని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: