విశాఖ నగరంలో అదో పచ్చటి చెట్టు. ఏడాదంతా కొమ్మలు రెమ్మలతో కళ కళలాడుతుంది. సీజన్లో తెల్లటి పువ్వులతో ఆకర్షిస్తుంది. కానీ, ఆ చెట్టు పేరు చెబితేనే ఇప్పుడు గ్రేటర్ జనం భయంతో వణికి పోతున్నారు. విశాఖవాసులను అంతగా భయ పెడుతున్న ఈ చెట్టు కథేంటో ఓ లుక్కేద్దాం.

 

హుద్‌ హుద్ తుఫాన్‌ విశాఖవాసులకు ఓ పీడకల. సైక్లోన్ వచ్చి ఏళ్లు గడచిపోతున్నా.. ఆ పేరు చెబితేనే నగర ప్రజలు ఇప్పటికీ వణికిపోతారు. 2014లో ఈ పెనుతుఫాన్‌ దెబ్బకు గ్రీన్‌ సిటీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న చెట్లు మొత్తం కూలీ పోవడంతో.. సిటీ అంతా కళావిహీనం అయిపోయింది. 

 

విశాఖకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం మొదలుపెట్టింది అప్పటి ప్రభుత్వం. ఆ సమయంలో నర్సరీల నుంచి నగరంలోకి ఎంటర్‌ అయినవే.. ఏడాకులు పాలచెట్లు. ఏడాదంతా పచ్చగా ఉండడం, త్వరత్వరగా పెరగడం ఈ చెట్ల ప్రత్యేకత. సుమారు గ్రేటర్ విశాఖ పరిధిలో ఐదు లక్షల దాకా వీటి సంఖ్య చేరింది. అయితే, ఇందులోనే ఓ ప్రమాదం పొంచి ఉంది. ఈ వృక్షాల పేరు ఇండియన్ డెవిల్ ట్రీ. పేరుకు తగ్గట్టుగానే విశాఖ ప్రజలను ఏడిపిస్తున్నాయి ఈ దెయ్యం చెట్లు. 

 

ఫ్లవరింగ్‌ సీజన్‌ మొదలవగానే ఈ చెట్ల పూలు వికసిస్తాయి. అంతే అక్కడి ప్రజల్లో భయం మొదలవుతోంది. ఎందుకంటే.. వీటి పుప్పొడి మహా డేంజరస్. ఆ పుప్పొడి కలిసిన గాలి పీల్చిన వారికి శ్వాస, చర్మ వ్యాధులు కన్ఫామ్. ఆస్తమా, అలెర్జీలు ఉన్నవారు ఈ గాలిలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇప్పటికే ఇండియన్ డెవిల్ ట్రీ సంఖ్యను తగ్గించేందుకు నోయిడా, పూణే కార్పోరేషన్లు ప్రయత్నిస్తున్నాయి.

 

తెలుగు రాష్ట్రాల్లో ఏడాకుల పాలుగా పిలిచే ఈ చెట్టు ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నిలబడగలదు. ఇవి ఎంత ప్రమాదకరమో అంత ప్రయోజనం కూడా. ఈ చెట్ల చెక్కను బ్లాక్ బోర్డ్స్, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. . అయితే, ఎక్కువ సంఖ్యలో వీటిని నగరాల్లో పెంచడం చాలా ప్రమాదకరమంటున్నారు ఆంధ్రాయూనివర్శిటీ శాస్త్రవేత్తలు.

 

మొత్తం మీద.. ఆరోగ్యానికి హానికారణమైన ఏడాకులు పాలచెట్లను తొలగించాలని జీవీఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు నగరప్రజలు. స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల్లో  సైతం వీటి సంఖ్య ఎక్కువగా ఉండడంతో.. వాటి సంఖ్యను తగ్గించే పనిలో పడ్డారు జీవీఎంసీ అధికారులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: