ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాల కొరకు ప్రభుత్వం లిక్కర్ కార్డ్ ప్రవేశపెట్టబోతుందని గత రెండు రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని ఇకనుండి ఎవరైనా మద్యం కొనాలంటే లిక్కర్ పర్చేజ్ కార్డ్ కొనాలనే వార్త వైరల్ అవుతోంది. కార్డ్ పొందాలంటే 5,000 రూపాయలు చెల్లించాలని మొబైల్ కు రీచార్జ్ చేసినట్లుగా ఆ కార్డ్ కు రీచార్జ్ చేయించాలని వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఈ కార్డ్ అందరికీ ఇవ్వరని 25 సంవత్సరాల వయస్సు దాటి డాక్టర్ నుండి ఆరోగ్యంగా ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్ పొందిన వారికి మాత్రమే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న లిక్కర్ కార్డ్ ఇదేనంటూ ఒక కార్డ్ వైరల్ అవుతోంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ కార్డ్ ప్రవేశపెట్టే యోచనలో లేదని తెలుస్తోంది. అందువలన వైరల్ అవుతున్న ఈ కార్డ్ నిజం కాదని ఫేక్ అని తేలిపోయింది. 
 
ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజర్ వాసుదేవరెడ్డి లిక్కర్ కార్డుల గురించి వస్తున్న వార్తలు అవాస్తవం అని అన్నారు. గత కొన్ని రోజులుగా లిక్కర్ కార్డుల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని చెప్పారు. ప్రభుత్వం మద్యం దుకాణాల నుండి లాభాలను ఆశించటం లేదని చెప్పారు. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం అమ్మకాలు జరుపుతోందని అన్నారు. 
 
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యపాన నిషేధం దిశగా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. మద్యం ధరలను కూడా గతంతో పోలిస్తే భారీగా పెంచింది. బార్ ల లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచింది. వైసీపీ ప్రభుత్వం రెస్టారెంట్లలో మద్యం విక్రయాల సమయాన్ని తగ్గించటంతో పాటు పర్మిట్ రూమ్ లకు కూడా అనుమతి ఇవ్వకపోవటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: