ఏపీలో ఎమ్మెల్యేల పార్టీ మార్పులపై క్లారిటీ వచ్చేసినట్టేనా..? అధికార పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో పడిందెవరూ...? డుమ్మా కొట్టి హింట్‌ ఇచ్చారా...? తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన రాజకీయ మార్పులపై ఓ రిపోర్ట్. 

 

ఏపీ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఆసక్తికర చర్చ సాగింది. వల్లభనేని వంశీ, గొట్టిపాటి రవి, గంటా శ్రీనివాసరావు అసలు సభకు వస్తారా... రారా? వస్తే.. ఎక్కడ కూర్చుంటారు అనేదానిపై జోరుగా డిస్కషన్‌ జరిగింది. అయితే తొలిరోజు సభకు వల్లభనేని వంశీ, గొట్టిపాటి రవి మాత్రమే వచ్చారు. గొట్టిపాటి రవి టీడీపీ సభ్యులతో కలిసే కూర్చున్నారు. మరోవైపు- బీజేపీలోకి వెళ్తారని అనుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం సభకు రాలేదు. టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే  వల్లభనేని వంశీ సభకు వచ్చినా.. టీడీపీ సభ్యులతో కలిసి కూర్చోలేదు. కాకపోతే టీడీపీ సభ్యులకు కేటాయించిన సీట్లలో వెనుకవైపు ఖాళీగా ఉన్నచోట ఒంటరిగా కూర్చున్నారు వంశీ. 

 

23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు వైసీపీతో.... మరికొందరు బీజేపీతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యు ఉన్నట్లు ఊహాగానాలు విన్పించాయి. దీనికి చెక్‌ పెడుతూ ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సభకు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక గొట్టిపాటి రవి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. మైనింగ్‌ వ్యాపారంలో ఉన్నన తనపై అధికారులు కావాలనే కేసులు వేశారని ఆరోపించారు. ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే అయినా...రాజకీయ ప్రయాణంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు రవి. 

 

మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సభకు దూరంగా ఉన్నారు. తొలి రోజు ఆయన సభకు హాజరు కాలేదు. విశాఖలోనే ఉండిపోయారు. ఇక బుచ్చయ్య చౌదరి, పయ్యావుల, బాలకృష్ణ వివిధ కారణాలతో సభకు రాలేదు. సభకు గైర్హాజరుపై పార్టీ అధిష్టానానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: