మహిళా భద్రతపై ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌ చర్చ జరిగింది. ఈ సమావేశాల్లోనే బిల్లు పెడతామన్న జగన్‌... తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పారు. టీడీపీ హయాంలోనే మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయన్న ఆయన .. కొందరు నేతలకు నలుగురు భార్యలున్నా సరిపోవడం లేదని సెటైర్లు వేశారు. 

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు మహిళ భద్రతపై హాట్ హాట్ డిస్కషన్‌ జరిగింది. టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ విమర్శలు గుప్పించింది. గత ఐదేళ్లలో జరిగిన అరాచకాలను ప్రస్తావించింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

 

మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు సీఎం జగన్‌. ఇప్పుడున్న చట్టాలు సరైన శిక్షలు వేయడానికి సరిపోవడం లేదని.. అందుకే ఈ సమావేశాల్లోనే ప్రత్యేక చట్టం తీసుకొస్తామని సీఎం చెప్పారు.  ఇలాంటి కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే టీడీపీ సభను అడ్డుకోవడం సరికాదని అన్నారు జగన్‌. ఇటు పవన్‌పేరు ప్రస్తావించకుండానే సెటర్లు వేశారు ముఖ్యమంత్రి. కొందరు నేతలు నలుగురు భార్యలు కావాలని కోరుకుంటున్నారని కౌంటర్  ఇచ్చారు.

 

మహిళల భద్రతకు రాష్ట్రంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీకి తెలిపారు హోంమంత్రి సుచరిత. కఠిన శిక్షలు వేయడం కోసం ఇప్పుడున్న చట్టం కాకుండా కొత్త చట్టం తీసుకొస్తామని ఆమె చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టాన్ని టీడీపీ స్వాగతించింది. నిందితులు తప్పించుకునే వీలులేకుండా చట్టం తేవాలని సూచించింది.

 

మహిళల భద్రత, ఉల్లి ధర పెంపు అంశాలపై సభలో టీడీపీపై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.  బాలకృష్ణ గతంలో చేసిన కామెంట్లను.. లోకేష్‌ను ప్రస్తావిస్తూ కామెంట్లు చేశారు. 


శీతాకాల సమావేశాల్లోనే మహిళల భద్రత కోసం కొత్త చట్టం తేవాలనే పట్టుదలతో ఉంది సర్కార్‌. సాధ్యమైనంత త్వరగా విధివిధనాలను తయారు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం న్యాయనిపుణనుల సలహాలు తీసుకోవాలని ఆలోచిస్తోంది ఏపీ ప్రభుత్వం.  

మరింత సమాచారం తెలుసుకోండి: