మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలపై జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆడవాళ్ళపై అత్యాచారాలు, హత్యాచారాలను నిరోధించటానికి చేయాల్సిన ప్రత్యేక చట్టాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది.  ఈ విషయమై జగన్ మాట్లాడుతూ ఆడవాళ్ళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనల్లో సాక్ష్యాధారాలుంటే మూడు వారాల్లోనే నిందితులకు శిక్షలు పడేలా కఠిన చట్టాలు రావాలని స్పష్టం చేశారు.

 

తెలంగాణాలో దిశ ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలు కఠినంగా ఉండాలన్నారు. నిందితులను పట్టుకున్న తర్వాత మొదటి వారంలో పోలీసు విచారణ జరిపి రెండో వారంలో కోర్టులో విచారణ జరగాలన్నారు. మూడో వారంలో శిక్షకు సంబంధించిన విచారణ పూర్తియిపోయి నిందితులకు ఉరిశిక్ష వేసేట్లుగా చట్టాలుండాలన్నారు. ఆడవాళ్ళపై అత్యాచారాలు, హత్యాచారలు చేసే వాళ్ళకు ఉరిశిక్షకు తక్కువ శిక్ష ఉండకూడదన్నారు.

 

మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాల్లో మద్యపానం కూడా ఒకటిగా నిపుణులు చెబుతున్న విషయాన్ని జగన్ ప్రస్తావించారు. అందుకనే మద్య నియంత్రణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దశలవారీగా ప్రభుత్వం మద్య నియంత్రణకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 

దిశ ఉదంతం లాంటిది రాష్ట్రంలో కూడా జరిగితే పోలీసులు ఎలా స్పందించాలనే విషయంలో ముందు జాగ్రత్తగా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాచారాలు, హత్యాచారాల విచారణ విషయంలో పోలీసులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని, విచారణలో స్వేచ్చ కూడా ఇవ్వాలని జగన్ అభిప్రాయపడ్డారు. దిశ హత్యాచారం నిందితులను ఎన్ కౌంటర్ చేసినందుకు కేసియార్ కు జగన్ హ్యట్సాఫ్ చెప్పారు.

 

ఎన్ కౌంటర్లు సినిమాల్లో జరిగితే అందరూ చప్పట్లు కొడతారని అదే దిశ ఘటనలో జరిగిన తర్వాత ఎన్ కౌంటర్లు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నట్లు మండిపడ్డారు. పనిలో పనిగా మానవ హక్కుల సంఘాల వాదనను కూడా జగన్ తప్పుపట్టారు. నిజానికి మానవ హక్కుల సంఘం ప్రస్తావనను జగన్ సభలో తెచ్చుండకూడదు. మొత్తానికి ఆడవాళ్ళ భద్రతపై తీసుకొరావాల్సిన కొత్త చట్టంపై జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: