వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార నిందుతల ఎన్ కౌంటర్ విషయంలో పోలీసులకు పెద్ద షాకే తగలబోతోంది. కారణాలు ఏవైనా నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే  ఎన్ కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలతో  పోలీసులు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారనే చెప్పాలి.

 

పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ అంత ఫేక్ అంటూ ప్రజా హక్కుల సంఘాలు, మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి. నిందితులకు కోర్టు విచారణ ద్వారా మాత్రమే శిక్షలు విధించాలంటూ ఇపుడు అనేకమంది వాదిస్తున్నారు. నిందితుల విషయంలో తీర్పులు చెప్పే అధికారం పోలీసులకు లేదని సంఘాల కార్యకర్తలు గట్టిగా వాదిస్తున్నారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే  దిశ నిందితులకు మరణశిక్ష విధించాలని, కొట్టి చంపేయాలని, ఎన్ కౌంటర్ చేసేయాలని దేశవ్యాప్తంగా లక్షలమంది డిమాండ్లు చేసినపుడు ఈ హక్కుల సంఘాలేవీ మాట్లాడలేదు. ఎప్పుడైతే ఎన్ కౌంటర్ జరిగిందో వెంటనే హక్కుల సంఘాల గోల మొదలైంది. అంతకుముందు ఎన్ కౌంటర్ చేసేయాలంటూ డిమాండ్ చేసిన వాళ్ళెవరూ ఇపుడు మాట్లాడటం లేదు.

 

సరే వీళ్ళ గోల ఎలాగున్నా పోలీసులకు వ్యతిరేకంగా దాఖలైన కేసులపై హై కోర్టు, సుప్రింకోర్టులో ఈరోజు విచారణ మొదలవుతోంది. ఎన్ కౌంటర్లో నిందితులను కాల్చిన బుల్లెట్లు పోలీసులు లెక్కలు చెప్పటం కష్టమనే ప్రచారం జరుగుతోంది. వాడిన బుల్లెట్ల కోసం పోలీసులు ఇంకా దేవులాడుతునే ఉన్నారు. ఇప్పటికే మానవహక్కుల సంఘం తన విచారణను స్పీడు పెంచింది.

 

ఎన్ కౌంటర్ ను గనుక పోలీసులు సమర్ధించుకోలేకపోతే  చాలా ఇబ్బందులు పడాల్సిందే. ఎందుకంటే నిందితులు నలుగురిని పోలీసులకు కోర్టు విచారణ నిమ్మితం అప్పగించింది. కాబట్టి ముందు కోర్టుకు పోలీసులు సమాధానం చెప్పుకోవాలి. తర్వాత హక్కుల సంఘాల లాయర్ల క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా సమర్ధించుకోవాలి. ఇదంతా పోలీసులకు తలనొప్పులు తెప్పించే వ్యవహారమే అనటంలో సందేహం లేదు. మరి ఈ సమస్యలో నుండి పోలీసులు ఎలా బయటపడతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: