ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలతో తెలుగుదేశం పార్టీ బాగా బలహీనపడిపోయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు అన్ని చోట్ల బలంగా ఉండే టీడీపీకి ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో దిక్కులేకుండా పోయింది. త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్న టీడీపీ చాలాచోట్ల నాయకత్వలేమీతో కొట్టుమిట్టాడుతోంది. ఇలా టీడీపీ మరి వీక్ అయిపోయిన స్థానాల్లో తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం, పి. గన్నవరం నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల టీడీపీని నడిపించే నాయకుడే లేడు.

 

తోట త్రిమూర్తులు పార్టీలో ఉన్నంత కాలం రామచంద్రాపురంలో టీడీపీ బలంగానే ఉంది. కానీ మొన్న ఎన్నికల్లో ఆయన ఓడిపోవడమే వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కు ఎవరు లేకుండా పోయారు. అటు పి. గన్నవరంలో టీడీపీకి అండ లేదు. మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేలపూడి స్టాలిన్ బాబుని...ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక ఆయన సస్పెండ్ అయ్యాక నియోజకవర్గంలో టీడీపీ దిక్కుతోచని పరిస్తితిలో ఉంది.

 

2014లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పులపర్తి నారాయణమూర్తికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా స్టాలిన్ కి టికెట్ ఇచ్చారు. దీంతో పులపర్తి ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇవ్వలేదు. ఇక ఎన్నికలు అయిపోయాక ఆయన బీజేపీ తీర్ధం తీసుకున్నారు. ఒకవేళ ఆయన టీడీపీలో ఉన్న నియోజకవర్గంలో పార్టీకి కాస్త అండ దొరికేది. కానీ ఆయన కూడా లేకపోవడం, స్టాలిన్ బాబు సస్పెండ్ కావడంతో నియోజకవర్గంలో కేడర్ చెల్లాచెదురైపోతుంది.

 

ఇప్పటికే రెండు నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. కేడర్ కూడా నడిపించే నాయకుడు లేకపోవడంతో వారి దారి వారు చూసుకుంటున్నారు. ఇక రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లోపు ఇక్కడ ఇన్-చార్జ్ లని నియమించకపోతే ఇక్కడ టీడీపీ అడ్రెస్ గల్లంతు కావడం ఖాయమే. మొత్తానికి  చంద్రబాబు ఈ రెండు స్థానాల్లో టీడీపీని గాలికొదిలేసినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: