దేశంలో ఆర్థిక మాంద్యం లేదన్న కేంద్రం మాటల్లో వాస్తవం లేదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ గొప్పలు చెప్పుకుంటుంది కానీ, వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అన్నారు కేసీఆర్. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలసిన పన్నుల వాటాపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖ రాశారు సీఎం కేసీఆర్. 


రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి పన్నుల వాటాగా రాష్ట్రానికి 19 వేల 7 వందల 19 కోట్లు రావల్సి ఉండగా.. 8 నెలల కాలానికి కేవలం సగం నిధులే విడుదలయ్యాయని ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఢిల్లీ వెళ్లి.. రాష్ట్రానికి నిధులు తక్కువగా వచ్చాయని చెప్పారు. అయితే దీనిపై స్పందించిన కేంద్ర అధికారులు.. ఈ తగ్గుదల ఏకంగా 15 శాతం ఉండే ఛాన్స్ ఉందని, పరిస్థితులు బాగాలేవని చెప్పినట్టు తెలుస్తోంది.

 

పార్లమెంట్ లో మంత్రులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని సీఎం కేసీఆర్ సమీక్షలో అభిప్రాయపడ్డారు. దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రతీ రోజూ గొప్పలు చెప్పుకుంటోంది కానీ.. వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. తెలంగాణకు రావల్సిన నిధుల్ని విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు కేసీఆర్. కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఏదో ఒక శాఖలో కాకుండా అన్ని శాఖల్లో ఖర్చులు తగ్గించడానికి తగు రీతిలో చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు - రాష్ట్ర ఆర్థిక పరిస్థితి- ఇతర ఆర్థిక అంశాలపై ఈనెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులకు సమగ్రమైన నోట్ అందించాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: