పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనను మమత ఇంటికి పిలిచి మరీ అవమానించారన్న గవర్నర్‌ కామెంట్స్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ బెంగాల్‌ గవర్నర్‌ను సీఎం ఎప్పుడు? ఎలా అవమానించారు?

 

పశ్చిమ బెంగాల్ లో సీఎం, గవర్నర్ల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. నువ్వే-నేనా అన్నట్టు మమత, జగదీప్‌ ధన్‌ఖర్‌ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇష్టాగోష్టిలో పాల్గొన్న బెంగాల్‌ గవర్నర్‌... మమత తనను ఇంటికి పిలిచి మరీ అవమానించారని ఆరోపించారు. గత అక్టోబర్‌లో దసరా సందర్భంగా గవర్నర్‌ను తమ ఇంటికి ఆహ్వానించారు సీఎం మమత. దీంతో మమత ఇంట్లో దుర్గాపూజకు హాజరయ్యారు గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌.  అయితే తన పరిస్థితి ఔరంగజేబు రాజ్యానికి వెళ్లి అవమానపడ్డ శివాజీలా మారిందని వాపోతున్నారు గవర్నర్‌. అయితే తాను మమతా బెనర్జీని ఔరంగజేబుతో పోల్చడం లేదని స్పష్టం చేశారు. 

 

ఔరంగజేబు తన పుట్టినరోజు సందర్భంగా శివాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. అయితే అప్పుడు శివాజీని సభలో సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపర్చాడు. మమత కూడా తనను ఇంటికి పిలిచి అవమానించారని ఆరోపించారు గవర్నర్‌.  తనకు జరిగినట్టు బహుశా ఏ రాష్ట్ర గవర్నర్‌కు జరగలేదేమో అన్నారు జగదీప్‌ ధన్‌ఖర్‌. తాను దాదాపు నాలుగు గంటల పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్నానని... ఇదంతా అధికారిక మీడియా ప్రత్యక్ష ప్రసారం చేసిందన్నారు. అయితే అందులో తనను కనీసం నాలుగు సెకన్లు కూడా చూపించలేదని చెప్పుకొచ్చారు గవర్నర్‌.  

 

మమతాబెనర్జీ, గవర్నర్‌ మధ్య మాటల యుద్ధం కొత్తేమీ కాదు. అయితే తమ ఇంట్లో జరిగిన దసరా వేడుకలకు గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ను మమత ఆహ్వానించడం... ఆయన పాల్గోడంతో వీళ్లిద్దరి మధ్య సయోధ్య కుదిరిందా అనే సందేహాలు కలిగాయి. కానీ... ఆ రోజు మమత తనను అవమానించారని చెబుతున్నారు గవర్నర్‌ జగదీప్‌. అంతేకాదు... బెంగాల్‌లో పాలన అస్తవ్యస్తంగా ఉందని... ఇది తనను ఆందోళనకు గురిచేస్తోందంటున్నారు జగదీప్‌ ధనఖర్‌.  

మొత్తానికి రాష్ట్రాన్ని జోడెద్దుల్లా అభివృద్ధిపథంలో నడిపించాల్సిన గవర్నర్‌, సీఎం పంతాలు, పట్టింపులకు పోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వీరి తీరు వల్ల బెంగాల్‌ అథోగతిపాలవుతోందని విమర్శిస్తున్నారు ఇంకొందరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: