ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతోనే.. నిరుద్యోగులకు కొత్త ఉత్సాహం వచ్చింది. వరుసగా నోటిఫికేషన్లు వచ్చాయి. చిన్నదో పెద్దదో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం దొరికే అవకాశం వచ్చింది. గ్రామ వాలంటీర్లతో కలుపుకుని దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకూ కల్పించారు. అయితే మరి ప్రభుత్వ ఉద్యోగాలు రాని వారి మాటేమిటి.. ?

 

అందుకే అలాంటి వారి కోసం జగన్ ఇప్పుడు ఓ సూపర్ ప్లాన్ రచించారు. కేవలం డిగ్రీలు చదివి ఉద్యోగాలు దొరకకుండా ఉన్న వారికి స్కిల్ డెవలప్ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా ఓ ప్రభుత్వ శాఖనే సృష్టించారు. గత ప్రభుత్వాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగినా ఇలా ఏకంగా ఓ ప్రభుత్వ శాఖను ఇందుకోసం సృష్టించడం మాత్రం చెప్పుకోదగిన మార్పుగానే చెప్పొచ్చు.

 

ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా మరో శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం’ పేరిట కొత్త పాలనశాఖ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు విడుదల చేశారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఈ కొత్త శాఖ పర్యవేక్షిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించారు.

 

దీని అమలును ఈ కొత్త శాఖ పర్యవేక్షిస్తుంది. అంతే కాదు.. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని కొత్త ప్రభుత్వ శాఖలో విలీనం చేశారు. ఈ కొత్త విభాగానికి రాష్ట్రస్థాయిలో ఒక కార్యదర్శి, అదనపు కార్యదర్శితో పాటు ఇతర సిబ్బంది ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటివరకూ 36 శాఖలు ఉండగా ఈ నైపుణ్యాభివృద్ధిశాఖ 37వ శాఖగా అవతరించింది. ఆలోచన అద్భుతంగానే ఉంది. మరి ఆచరణ ఎలా ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: