కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ బిల్లు హాట్ హాట్ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న స‌మ‌యంలో అధికార‌-ప్ర‌తిప‌క్షాల వారీగా పార్టీలు చీలిపోయాయి. పౌరసత్వ బిల్లుతో ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రస్తావించారు. ఈ బిల్లుపై ఈశాన్య రాష్ర్టాల ప్రజలు ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు. పౌరసత్వ సవరణ బిల్లుకు మేము కట్టుబడి ఉన్నామని హోం మంత్రి లోక్‌సభలో అన్నారు. ఈ బిల్లు ద్వారా ఎవరి హక్కులు హరించడం లేదనీ, బిల్లు ద్వారా మైనార్టీలు మరిన్ని హక్కులు పొందుతారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ చ‌ర్చ సంద‌ర్భంగా తెలుగుఎంపీల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. 

 


లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా  ఎంపీ బండి సంజయ్ కుమార్, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ.. బిల్లును ముస్లింలకు కూడా వర్తింపజేయాలనీ, బిల్లులో మార్పులు చేయకుంటే.. బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ఆయన కేంద్రానికి తెలిపారు. బిల్లు రాజ్యాంగ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నదన్న ఆయన.. బిల్లును టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. టీఆర్ఎస్  మైనార్టీల ప్రయోజనాల కోసం కట్టుబడి ఉందని అన్నారు. తమ పార్టీ లౌకికవాద పార్టీ , రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ.... ఈ బిల్లును  పార్టీ వ్యతిరేకిస్తోందని నామా నాగేశ్వరావు స్పష్టం చేశారు.

 

ఈ సందర్భంగా కలుగచేసుకున్న ఎంపీ బండి సంజయ్... మరి హిందువుల ప్రయోజనాలు మాత్రం టీఆర్ఎస్ కు పట్టవా అని నిలదీశారు. హిందువులు ప్రజలు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం... సెప్టెంబర్ 17న విమోచన దినం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని అన్నారు. వాగ్వాదం వద్దులే అన్నట్టుగా హోంమంత్రి అమిత్ షా సంకేతం ఇవ్వడంతో బండి సంజయ్ కూర్చున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: