నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు 2019 కు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. మొత్తం 391 ఓట్లకు గానూ బిల్లుకు అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. నిన్న ఉదయం నుంచి బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది, సుదీర్ఘంగా అడిగిన  ప్రశ్నలకు హోం మంత్రి అమిత్ షా ఓపిగ్గా సమాధానమిచ్చారు. 

 

నిన్న  లోక్‌సభ లో బిల్లుపై చర్చ సందర్భంగా మజ్లిస్ పార్టీకి చెందిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించారు. హోం మంత్రి అమిత్ షా ను అడాల్ఫ్ హిట్లర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్లును ఆమోదిస్తే భారత్ మరో ఇజ్రాయెల్ అవుతుందని పేర్కొన్నారు. బిల్లు ప్రతులను సభలోనే చించేసి బిల్లుపై తన వ్యతిరేకతను సభకు చెప్పారు. ఇంతలా అసదుద్దీన్ ఓవైసీ ఆక్రోశం వెనుక అసలు బిల్లులో ఏముంది. 

 

పౌరసత్వ సవరణ బిల్లు 2019 లో, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు మరియు పార్సీలను భారతదేశ పౌరసత్వానికి అర్హులుగా మార్చడానికి 1955 పౌరసత్వ చట్టానికి సవరణ చేసింది కేంద్రం. ఈ సవరణ బిల్లు ప్రకారం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ దేశాల నుంచి అక్రమంగా భారతదేశంలో ప్రవేశించి గత 5 సంవత్సరాలకు పైగా భారత్ లో నివసించే వారికి భారతదేశ పౌరసత్వం లభించనుంది. బిల్లులో ముస్లింలను చేర్చకపోవడంపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

 

"ముస్లింలకు స్థానం లేకుండా చేయడానికి పౌరసత్వ (సవరణ) బిల్లు మరియు ఎన్‌ఆర్‌సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) అంటూ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం మరియు మన స్వాతంత్ర్య సమరయోధులను అవమానించేలా ఉన్న ఈ బిల్లును నేను వ్యతిరేకిస్తున్నాను." అని అసదుద్దిన్ ఓవైసీ తెలిపారు.

 

కేవలం అసదుద్దీన్ ఓవైసీ నే కాకుండా మిగతా విపక్ష నేతలు అధీర్‌ రంజన్‌ చౌధురి, సౌగతారాయ్‌, ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్‌, గౌరవ్‌ గొగొయి, శశిథరూర్‌, మనీష్‌ తివారీ కూడా బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బిల్లును వ్యతిరేకించేవారంతా హిందూ వ్యతిరేకులన్నట్లుగా చిత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, వైసీపీ పార్టీ బిల్లుకు అనుకూలమని ప్రకటించింది అయితే బిల్లుపై తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. తెరాస మాత్రం బిల్లును వ్యతిరేకించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: