గ‌త కొద్దికాలంగా, ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి టార్గెట్‌గా పావులు క‌దుపుతున్న బీజేపీ నేత‌ల‌కు ఊహించ‌ని షాక్ ఎదురైంది. ముఖ్య‌మంత్రిని వైసీపీని టార్గెట్ చేస్తుండ‌టం, ఏపీలో జ‌గ‌న్ పాల‌న‌పై దుమ్మెత్తిపోయ‌డం మ‌రోవైపు జ‌నసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు త‌మ పూర్తి అండ‌ను ఇస్తూ వైసీపీ పాల‌న‌పై విరుచుకుప‌డేలా చేస్తున్న బీజేపీ ఇప్పుడు అదే అంశాల ఆధారంగా ఇరుకున ప‌డిపోయింది. ఎక్క‌డైతే...ఏ రూపంలో అయితే జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకుందో.. ఇప్పుడు అదే రూపంలో సరిగ్గా అదే అంశంలో వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బీజేపీని ఇరుకున పెట్టేశారు. ఏక‌కాలంలో ఇటు త‌న ప‌రిపాల‌న అటు త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో ఏకంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాకు షాకిచ్చారు.

 

వివ‌రాల్లోకి వెళితే... నరసాపురం మాజీ పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు వెంకట కనక రంగరాజు, గోకరాజు గంగరాజు సోదరులు గోకరాజు రామరాజు,  గోకరాజు వెంకట నరసింహారాజు, మనుమడు ఆదిత్యలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయ‌న బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అమిత్ షా ఎప్పుడు ఏపీ పర్యటనకు వచ్చినా కృష్ణా కరకట్టపై ఉన్న గోకరాజు అతిథి గృహంలోనే దిగేవారు. అంత‌టి స‌న్నిహిత నేత‌కు జ‌గ‌న్ వైసీపీ కండువా క‌ప్పడం సంచ‌ల‌నంగా మారింది. బీజేపీలో చేరేందుకు నేతలు క్యూ కడతారని, వైసీపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ లీకులు వదులుతున్న బీజేపీకి జ‌గ‌న్ అదిరిపోయే షాకిచ్చార‌ని అంటున్నారు.

 

మ‌రోవైపు త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లో కూడా జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. త‌న బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టార్గెట్‌గా సీఎం జ‌గ‌న్ క‌దులుతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సిట్ బృందం ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి ఆదికి నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరుకాని నేప‌థ్యంలో...ఆది తీరుపై పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. గ‌త మంగళవారం నుంచి విచారణకు సహకరించని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై కోర్టును ఆశ్ర‌యించి..విచార‌ణ చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే ఆది బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: