గత కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో  వల్లభనేని వంశీ అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తన టిడిపి సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అయితే వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ జగన్ తో  భేటీ కావడం తో... వంశీ ఇంకొన్ని రోజుల్లో వైసీపీ లోకి రావడం ఖాయమని ఆంధ్ర రాజకీయాలు చర్చలు నడిచాయి. అటు అసెంబ్లీలో కూడా వల్లభనేని వంశీ ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై కూడా ఆసక్తి నెలకొంది. 

 

 

 

 ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వల్లభనేని వంశీ. తాను తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశాను  అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ను  కలవడం ఇదేమీ తొలిసారి కాదని ఆయన అన్నారు. అయితే అసెంబ్లీలో వంశీ మాట్లాడుతున్న సందర్భంలో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత టిడిపి పార్టీ తనపై దుష్ప్రచారం చేసిందని వంశీ  విమర్శించారు. తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు మీడియాలో తాను చూశానని తెలిపారు. 

 

 

పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ పై కరెంటు పనులు సహా ఇళ్ల పట్టాల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ ను  తాను కలిశానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ వేదికగా తెలిపారు. తాను స్టేట్ ర్యాంక్ వచ్చిన వాడినని హాస్టల్లో ఉండి చదువుకున్నాను అంటూ వంశీ చెప్పుకొచ్చారు. ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం అర్థం కాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని... ఒకానొక సమయంలో ఏకంగా చదువు మానేద్దాం అని ఆలోచన కూడా తనకు వచ్చిందని వల్లభనేని వంశీ తెలిపారు. ఇప్పుడు పేద విద్యార్థులు అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని జగన్ సర్కార్ ను అభినందించారు వంశీ.

మరింత సమాచారం తెలుసుకోండి: