రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దిశ హత్య కేసులోని నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో చనిపోయిన విషయం తెలిసిందే. సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడిన సమయంలో ప్రధాన నిందితుడైన అరీఫ్ వయస్సు 26 సంవత్సరాలని చెప్పగా జొల్లు నవీన్, చెన్న కేశవులు, జొల్లు శివల వయస్సు 20 సంవత్సరాలని చెప్పారు.  
 
కానీ నిందితుల కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల వాదనలో నిజం లేదని నిందితులలో ఇద్దరు మైనర్లు ఉన్నారని చెబుతున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం పంపిన బృందానికి నిందితుల కుటుంబ సభ్యులు నిందితులలో ఇద్దరు మైనర్లు అని చెప్పినట్లు తెలుస్తోంది. ఆధార్ కార్డ్, పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్ల ప్రకారం నిందితులలో ఒకరి వయస్సు 17 సంవత్సరాల ఆరు నెలలు కాగా మరొకరి వయస్సు 15 సంవత్సరాల 8 నెలలు అని తెలుస్తోంది. 
 
మానవ హక్కుల సంఘం నిందితుల ఆధార్ కార్డులోని పుట్టిన తేదీలకు, పాఠశాల బోనఫైడ్ సర్టిఫికెట్లకు సంబంధించిన పుట్టినరోజు తేదీలకు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. మానవ హక్కుల సంఘం బోనఫైడ్ సర్టిఫికెట్లలోని పుట్టినరోజు తేదీలను పరిగణనలోకి తీసుకుంటోందని తెలుస్తుంది. ప్రధాన నిందితుడైన అరీఫ్ , మరో నిందితుడు చెన్నకేశవులు డ్రైవర్లు అయినా డ్రైవింగ్ లైసెన్స్ లు లేనట్లు పోలీసులు గుర్తించారు. 
 
నిందితులలో జొల్లు నవీన్, జొల్లు శివ మైనర్లని తెలుస్తోంది. గత సంవత్సర కాలంగా జొల్లు నవీన్, జొల్లు శివ క్లీనర్లుగా పని చేసేవారని సమాచారం. నవీన్ తల్లి లక్ష్మీ మాట్లాడుతూ తమ పిల్లలు నేరం చేశారని పోలీసులు మాత్రం అలా క్రూరంగా చంపి ఉండకూడదని అన్నారు. శివ తండ్రి మాట్లాడుతూ మరణ శిక్ష విధించినా ఒప్పుకునేవాళ్లమని ఎన్ కౌంటర్ చేయడం మాత్రం సరికాదని చెప్పారు. పోలీసులకు చంపే హక్కు లేదని అన్నారు. రోజురోజుకు ఎన్నో మలుపులు తిరుగుతున్న దిశ హత్య కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: