ఇస్రో ఛైర్మన్ శివన్ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలొ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి పాదాల చెంత పీఎస్ఎల్వీ సీ-48 వాహన నౌక నమూనాను ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. శివన్ మీడియాతో మాట్లాడుతూ రేపు పీఎస్ఎల్వీ సీ -48 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశామని తెలిపారు. 
 
ఆర్ఏశాట్2 ఉపగ్రహాన్ని, బీఆర్ 1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నామని చెప్పారు. పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం ఇస్రోకు చారిత్రక ప్రయోగం కాబోతుందని అన్నారు. పీఎస్ఎల్వీ వాహన నౌకకు ఇది 50వ ప్రయోగం అని శివన్ తెలిపారు. శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం అని చెప్పారు. రేపు మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రయోగం చేపడతామని ఈరోజు మధ్యాహ్నం నుండి ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ను ప్రారంభిస్తామని శివన్ తెలిపారు. 
 
రేపు ప్రయోగం చేయనుండటం వలన శివన్ శ్రీవారిని ఈరోజు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆలయ అర్చకులు రంగనాయక మండపంలో ఆశీర్వచనం చేయగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రతి ప్రయోగానికి ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. రేపు చేయబోతున్న ప్రయోగం 23 గంటల పాటు కొనసాగనుందని చెప్పారు. 
 
ఈరోజు మధ్యాహ్నం 4.25 గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగంతో పాటు తొమ్మిది విదేశీ నానో ఉపగ్రహాలను కూడా ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. నానో ఉపగ్రహాల్లో జపాన్, ఇటలీ, ఇజ్రాయిల్ కు చెందినవి ఒక్కొక్కటి ఉన్నాయని ఎఎస్‌ఎకు చెందిన ఆరు ఉపగ్రహాలు ఉన్నాయని తెలుస్తోంది. 14 రోజుల స్వల్ప వ్యవధిలో ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో ఛైర్మన్ శివన్ మాట్లాడుతూ ఇస్రో చరిత్రలో పీఎస్ఎల్వీలో ఇది 50 వ రాకెట్ శ్రీహరికోట కేంద్రం నుంచి 75 వ రాకెట్ కావడం అపూర్వ ఘట్టం అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: