తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలలో పది రూపాయల నాణేలు చెల్లడం లేదు. ఎందుకు చెల్లడం లేదనే ప్రశ్నకు ఎవరి నుండి సరైన సమాధానం రాకపోయినప్పటికీ పది రూపాయల నాణేలను తీసుకోవటానికి మాత్రం ఎవరూ ఆసక్తి చూపించటం లేదు. ప్రజల్లో చాలామంది పది రూపాయల నాణేలు చెల్లవని అభిప్రాయపడుతున్నారు. కొందరు బ్యాంకు ఉద్యోగులు కూడా పది రూపాయల నాణేలు తీసుకోవటానికి ఆసక్తి చూపకపోవటం గమనార్హం. 
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో సందర్భాలలో పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని ప్రకటనలు చేసింది. వదంతులను నమ్మవద్దని ఆర్బీఐ ఎన్నోసార్లు ప్రకటనలు చేసినా చిరు వ్యాపారుల నుండి బస్ కండక్టర్ల వరకు 10 రూపాయల నాణేలను తీసుకోవటానికి ఆసక్తి చూపట్లేదు. కొందరు దుకాణాదారులు, వ్యాపారులు పది రూపాయల నాణేలను మేం తీసుకున్నా మా దగ్గరనుండి తిరిగి ఎవరూ తీసుకోవడం లేదని చెబుతున్నారు. 
 
కొన్ని ప్రాంతాలలో పది రూపాయల నాణేల వలన గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఆర్బీఐ పది రూపాయల నాణేలను రద్దు చేసినట్లు ఎక్కడా ప్రకటన చేయలేదని కొందరు డిమాండ్ చేస్తూ ఉండటం వివాదాలకు మూలమవుతోంది. బస్ కండక్టర్లు పది రూపాయల నాణెం ఇస్తే నోట్లు మాత్రమే తీసుకుంటామని పది రూపాయల నాణేలు చెల్లవని చెబుతున్నారు. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, కిరాణా షాపుల్లో కూడా పది రూపాయల నాణేలను తీసుకోవట్లేదు. 
 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన బ్యాంకులు పది రూపాయల నాణేలను తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినా కూడా బ్యాంకులు మాత్రం పది రూపాయల నాణేలను తీసుకోవటం లేదు. బ్యాంకు సిబ్బంది పది రూపాయల నాణెం చెల్లదని చెప్పకపోయినా సరైన స్థలం లేదని చెబుతూ పది రూపాయల నాణేలను తీసుకోవటం లేదు. రాజు అనే హోటల్ నిర్వాహకుడు బ్యాంకు అధికారులు పది రూపాయల నాణేలు వద్దని నిరాకరిస్తున్నరని బ్యాంకులు తీసుకోకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. యాదగిరి అనే ఆటో డ్రైవర్ నేను పది రూపాయల నాణెం తీసుకున్నా నా దగ్గర నుండి ఎవరూ తీసుకోవటం లేదని చెప్పారు. ప్రభుత్వాలు, బ్యాంకులు పది రూపాయల నాణేల చెల్లుబాటు విషయంలో చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: