తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప‌రిపాల‌న మ‌ధ్య స‌హ‌జంగానే ప్ర‌స్తుతం అనేక పోలిక‌లు, ప్ర‌స్తావ‌న‌లు, విశ్లేష‌ణ‌లు, విమ‌ర్శ‌లు, సూచ‌న‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య కుదిరిన దోస్తీ దీనికి అవ‌కాశం క‌ల్పించింది. మ‌రోవైపు, దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ హ‌త్య కేసు, అనంత‌రం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ నేప‌థ్యంలో...దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్ణ‌య శైలి, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల తీరును పోల్చుతూ అనేక‌మంది వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఇప్పుడు స‌రిగ్గా అదే రీతిలో మ‌రో అంశం ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య పోలిక‌కు కార‌ణ‌మైంది. హైద‌రాబాద్ కేంద్రంగా ఓ కీల‌క ప్రాజెక్టును ముఖ్య‌మంత్రి హోదాలో వైఎస్ మొద‌లుపెట్టగ‌...ప్ర‌స్తుత సీఎం కేసీఆర్ హ‌యాంలో పూర్తి కావ‌స్తోంది.

ఒక్క హైద‌రాబాద్ అనే కాకుండా....ముఖ్య న‌గ‌రాలు, ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం జంతు వ్యర్థాలను డంపింగ్‌యార్డుకు తరలించడమో, నాలాల్లో వేయడమో చేస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి హాని కలుగుతోంది. ఈ స‌మ‌స్య‌ను నివారించేందుకు,  జంతు వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా కోళ్లు, చేపలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన దేశంలోనే అత్యాధునిక రెండరింగ్ ప్లాంట్లు రెండింటినీ దాదాపు దశాబ్దం క్రితం అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. హైద‌రాబాద్ నగరవాసులకు సురక్షితమైన మాంసాన్ని అందించే ఉద్దేశంతో నాలుగు కబేళాలు, అలాగే వాటి నుంచి వెలువడే వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసేందుకు ఒక రెండరింగ్ ప్లాంటును మంజూరు చేసింది. వీటిలో ఒక‌టి హైద‌రాబాద్ శివారులోని చెంగిచర్లలో ఏర్పాటు చేశారు. ఈ రెండరింగ్ ప్లాంటులో ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.  ప్రారంభానికి సిద్ధమైంది. 

చెంగిచర్లలో రూ.2.86ఎకరాల విస్తీర్ణంలో రూ. 19.17కోట్లతో దీన్ని నిర్మించారు. దీని సామర్థ్యం రోజుకు 80మెట్రిక్ టన్నులు కాగా, దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 6.86కోట్లు గ్రాంటుగా ఇచ్చింది. రాంకీ సంస్థ దీన్ని నిర్మించగా, నిర్మాణంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హార్‌స్లీవ్ ఇండస్ట్రీస్ కంపెనీ యంత్ర పరికరాలను సరఫరా చేసింది. , మౌలిక సౌకర్యాలైన ప్రాసెసింగ్ భవనం, పరిపాలనా భవనం, రెండు కోట్ల లీటర్ల సామర్థ్యంగల ఓవర్‌హెడ్ ట్యాంక్, అండర్‌గ్రౌండ్ సంపు, ఈటీపీ ప్లాంటు, బాయిలర్ హౌస్ తదితర నిర్మాణాలు ఉన్నాయి. దీన్ని అందుబాటులోకి తెస్తే నగరంలోని వివిధ కబేళాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసేందుకు వీలు కలుగుతుంది. వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలు, డంప్ యార్డులో వేయడం వల్ల కలుగుతున్న కాలుష్య సమస్య కూడా దీనివల్ల తగ్గే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: