చటాన్‌పల్లి బైపాస్‌...గ‌త కొద్దికాలం వ‌ర‌కు ఈ ప్రాంతం పేరు స్థానికుల‌కు, అక్క‌డ ప్ర‌యాణించే వారికి మాత్ర‌మే తెలుసు. కానీ దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ దారుణ మాన‌భంగం, హ‌త్య ఉదంతం త‌ర్వాత‌....షాద్ నగర్ స‌మీపంలోని ఈ ప్రాంతం అంద‌రికీ సుప‌రిచితం అయింది. పెద్ద ఎత్తున వార్త‌ల్లో నిలుస్తోంది. ఆడ‌బిడ్డ‌పై దారుణానికి ఒడిగ‌ట్టి...ఆఖ‌రికి దారుణ‌మైన రీతిలో క‌న్ను మూసిన‌ నిందితుల‌ మృత‌దేహాలు అంత్య‌క్రియ‌ల‌కు సైతం నోచుకోకుండా ఇంకా ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ స్థితిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా వారు ఆకృత్యానికి పాల్ప‌డిన చ‌టాన్‌ప‌ల్లి బైపాస్ వద్ద మ‌రో ఘోరం జ‌రిగింది. భీక‌ర‌మైన‌ రోడ్డు ప్రమాదం తాజాగ జ‌రిగింది. స‌రిగ్గా ఎన్‌కౌంటర్ ఘటన వద్దే జ‌రిగిన‌ ఈ ప్ర‌మాదం స్థానికుల‌ను క‌ల‌చివేసింది. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన ఓ మ‌హిళ‌ను సద‌రు వాహ‌నం అద్దాలు ప‌గుల‌గొట్టి బ‌య‌ట‌కు తీయాల్సిన ప‌రిస్థితి ఎదుర‌వ‌డం ఆ యాక్సిడెంట్ తీరుకు నిద‌ర్శ‌నం.

 

దిశ ఘ‌ట‌న‌, ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన ప్రాంత‌మైన చ‌టాన్‌ప‌ల్లి బైపాస్ వ‌ద్ద‌ ఆగి ఉన్న లారీని టాటా ఏసీ వాహనం ఢీ కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురితో పాటు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. టాటా ఏస్‌ వాహనం గ్లాస్ పగిలి అందులో ఓ మహిళ ఇరుక్కుపోయింది. దీంతో వాహ‌నం గ్లాస్ పగులగొట్టిన స్థానికులు ఆమెను బయటికి తీశారు. అనంత‌రం క్ష‌తగాత్రుల‌ను స‌మీప‌ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 

 

ఇదిలాఉండ‌గా, దిశ నిందితులను ఎన్‌కౌంటర్‌చేసిన పోలీసులపై సిట్ లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ చేపట్టాలని దాఖలైన పిటిషన్లను బుధవారం విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. సోమవారం విచారణ సందర్భంగా న్యాయవాదులు జీఎస్ మణి, ఎంఎల్ శర్మ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ఈ కేసులను ప్రస్తావించారు. వీటిని బుధవారం విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: