ఓ వైపు చలి గజగజ, మరోవైపు గజరాజుల గజగజ... ఇదీ విజయనగరం ఏజెన్సీవాసుల పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. చేతికొచ్చిన పంటలను ఏనుగులు నిమిషాల్లో ధ్వంసం చేసేస్తున్నాయి. పొలాలకు వెళ్తున్నవారి ప్రాణాలు తీస్తుండడంతో ఆ గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు. 

 

రోజులు కాదు.. వారాలు కాదు.. సంవత్సరాలుగా ఏజెన్సీ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఏనుగులు. ఒక్కో గ్రామంలో వారం రోజులు తిష్టవేసి జనాల్ని భయపెడుతున్నాయి. గతేడాది శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లా జియమ్మవలస మండలంలోకి ఎనిమిది ఏనుగుల గుంపు అడుగుపెట్టింది. ఇలాంటివి మరో 15 ఏనుగుల గుంపు ఒడిశా అటవీ ప్రాంతంలోని ఏఓబి సరిహద్దుల్లో తిరుగుతోంది. విజయనగరం వచ్చిన 8 ఏనుగుల్లో ఒకటి.. గతేడాది సెప్టెంబర్‌ లో అర్దాంలోని అరటి తోటల్లో విద్యూత్ షాక్ తగిలి చనిపోగా.. మరొకటి తోటపల్లి ప్రాజెక్ట్‌ కాలవులో పడి మృతిచెందింది. మిగిలిన ఏనుగులను ఒడిశా తరలించినప్పటికీ.. అవి తిరిగి విజయనగరం ఏజెన్సీ ప్రాంతాలు జియమ్మ వలస, కురుపాం మండలాల్లో  తిరుగుతూ వందల ఎకరాల్లో పంటల్ని నాశనం చేస్తున్నాయి.

 

ఒడిశాలోని లఖేరిలో అతిపెద్ద ఎలిఫ్యాంట్‌ జోన్‌ ఉన్నప్పటికీ.. అక్కడ సరైన ఆహారం దోరక్కపోవడంతో పాటు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అవి పక్క ప్రాంతాలవైపు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల రెండు వేల ఎకరాల్లో పంటలు నాశనం కావడంతో పాటు సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఆరు నెలల్లో ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 

పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో ఫారెస్ట్ అధికారులు గ్రామాల్లోనే సంచరిస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి పూట బయటకు రావద్దని గ్రామస్తులను హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఏనుగుల సంచారంతో పార్వతిపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల ముందు మంట పెట్టుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. బాణాసంచా, బాంబుల పేలుడు శబ్దాలతో ఏనుగులు మరింత భయపడి ఎటువెళ్లాలో తెలియక జనవాసాల్లోకే దూసుకొస్తున్నాయి. ఈ ఏనుగుల గుంపు గ్రామాల్లో ఉన్న అరటి, చెరకు, వరి పంటలను నాశనం చేస్తోంది. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారమేమో అరకొరగా ఉందంటున్నారు రైతులు. 

 

జిల్లా ఏజెన్సీలో ఏనుగులను కట్టడి చేయడంలో అదికారుల చర్యలు ఫలించడం లేదు. వేల ఏకరాల్లో జరిగిన పంటనష్టానికి సుమారు కోటి నలబై  లక్షల పరిహారం రైతులకి అందించడంతో పాటు చనిపోయినవారి కుటుంబాలకు 5లక్షల రూపాయలు ఆర్థికసాయం అందించామని అధికారులు చెబుతున్నారు. ఎన్నిసార్లు తరిమినా ఏనుగులు మళ్లీ వస్తుండడంతో.. ఎలిఫ్యాంట్‌ రిహాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. అయితే దీనికి స్థానికులు వ్యతిరేకంగా ఉన్నట్టు తెలిసింది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి.. ఏనుగుల బారి నుంచి తమను రక్షించాలని గిరిజనులు వేడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: