తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు.  భూపాలపల్లిలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్‌ మెడికల్‌షాప్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం స్థానిక పాఠశాలలో జాతీయ గీతాలాపనలో పాల్గొని విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆతరువాత తన పర్యటనలో భాగంగా ఆమె కాటారం మండలం బోడగూడెంలో పర్యటించారు. అక్కడి గ్రామస్థులతో జరిగిన ముఖాముఖిలో ఆదివాసీ గిరిజన సమస్యలు, వారి స్థితిగతులను తెలుసుకున్నారు.  గ్రామ ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు.

 

తమిళిసై సౌందర్‌ రాజన్‌ కు అక్కడి గిరిజనులు వారి సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అక్కడ ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. వారి గ్రామ దేవతను దర్శించుకున్నారు. గిరిజనులతో కలిసి మొక్కలు నాటారు. అక్కడి నుంచి గిరిజన గ్రామదేవత లక్ష్మీదేవర అమ్మవారిని దర్శించుకున్నారు. గిరిజనులను రాజ్‌భవన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.  గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు.

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గర్వపడుతున్నానని గవర్నర్‌ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఆమె కొనియాడారు. తలసేమియా బాధితులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్య తెలంగాణకు కోసం అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


అనంతరం వరంగల్‌ అర్బన్‌శాఖ ఆధ్వర్యంలో జూనియర్‌ యూత్‌ రెడ్‌క్రాస్‌ సభ్యులతో సమావేశమయ్యారు. రెడ్‌క్రాస్‌లో బ్లడ్‌బ్యాంక్‌, తలసేమియా వ్యాధులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు తగినన్ని పరికరాలు, సౌకర్యాలు ఉండటం గొప్ప విషయమని చెప్పారు. వరంగల్‌ జిల్లాలో తలసేమియా పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషిచేస్తామన్నారు. వరంగల్‌ పర్యటనలో గవర్నర్‌కు జిల్లా కలెక్టర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ శ్రీహర్ష, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సాదరంగా ఆహ్వానించారు. డప్పువాయిద్యాలు, గిరిజన సంప్రాదాయ నృత్యాలతో గూడెం వాసులు ఆమెకు స్వాగతం పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: