కౌమార దశలోనే అతనితో స్నేహం పెంచుకున్న ఆమె, స్నేహాన్ని ప్రేమగా మార్చుకుంది. అత్తా మామలకు సేవలు, తమ్ముడితో కబుర్లు, భర్తతో అనురాగం తప్ప వేరే ప్రపంచం తెలియదు. తల్లిదండ్రులు కానీ నా అన్న వాళ్లు కానీ ఎవరూ లేరు. నమ్మిన వాడితో ఏడు అడుగులు ధైర్యంగా వేసిన పాపానికి నేడు నిండు గర్భంతో అనాథగా మారిపోయింది. దిశ హత్య కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య ధీనస్థితి ఇది.

 

చెన్నకేశవులు భార్య రేణుక చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన రేణుక చెన్నకేశవులును పెళ్లి చేసుకుంది. అత్తామామలు, ఆడపడుచు, భర్తతో సంతోషంగా గడుపుతోంది. మరికొద్ది రోజుల్లో మరో ప్రాణికి ఊపిరి పోస్తున్నాననే సంతోషంలో ఉన్న ఆమెకు తీరని కష్టం వచ్చింది. దారితప్పి, వ్యసనాలకు లోనైన ఆమె భర్త తన స్నేహితులతో కలిసి ఘోరానికి పాల్పడటం.. దిశ ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో ఆమె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

 

తన భర్త నిజంగా తప్పు చేస్తే ఎలాంటి శిక్షయినా విధించాలన్న రేణుక. చట్టప్రకారం శిక్షిస్తారని భావించింది. ఎన్‌కౌంటర్‌లో తన భర్త చనిపోయిన విషయం తెలియడంతో తల్లడిల్లిపోతోంది. పోలీసులు కస్టడికి తీసుకున్న తర్వాత ఒక్కసారంటే ఒక్కసారి కూడా భర్తతో మాట్లాడించలేదని వాపోతుంది. తన భర్త లేకుండా తాను బ్రతకలేనంటూ కన్నీటి పర్యంతమయింది. తనకు పుట్టబోయే బిడ్డకి ఏమని సమాధానం చెప్పాలని రోదిస్తోంది రేణుక. తానెలా బతకాలని. కుటుంబానికి దిక్కులేకుండా చేశారని వాపోతోంది. ఏది ఏమైనా కుటుంబంలో ఒకరి తప్పటడుగు మొత్తం కుంటుంబాన్నే చిదిమేస్తుంది. అనడానికి చెన్నకేశవులు ఉదంతమే ఉదాహరణ.  

 

మొత్తానికి దిశ హత్యకేసులో నిందితుల ఎన్ కౌంటర్.. ఇటు దిశ కుటుంబ సభ్యులతో పాటు నిందితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎందుకంటే అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు కాలి బూడిదగా మిగలడంతో దిశ కుటుంబ సభ్యులు ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు. ఇటు నిందితుల తల్లిదండ్రులు సైతం తమ కుమారులు ఇంటికి జీవనాధారంగా ఉండటంతో ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: