టీడీపీలో వల్లభనేనీ వంశీ కథ ముగిసింది. పార్టీపై ఆరోపణలు చేయడం, పార్టీ ఆయన్ని సస్పెండ్‌ చేయడంతో.. అసెంబ్లీలో వంశీ ఎటువైపు కూర్చుంటారన్న ఆసక్తి నెలకొంది. దీంతో వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించారు స్పీకర్‌. ఈ వ్యవహారంపై టీడీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.  

 

ఏపీ అసెంబ్లీలో రెండోరోజు వంశీ ఎపిసోడ్‌ కాకపుట్టించింది. సభ ప్రారంభమవుతూనే వంశీ ప్రసంగానికి అనుమతించారు స్పీకర్‌. క్వశ్చన్ హవర్‌కు ముందు వంశీ మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో టీడీపీ అభ్యంతరం తెల్పింది. సభా సంప్రదాయాలను స్పీకర్ ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది.  ప్రశ్నోత్తరాలు చేపట్టకుండా... ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. అసెంబ్లీ వైసీపీ ఆఫీసుగా మారిందంటూ టీడీపీ సభ్యులు హాట్‌ కామెంట్లు చేశారు. వంశీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. స్పీకర్‌ వారించడంతో... సభ నుంచి వాకౌట్‌ చేశారు.

 

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని పార్టీ ఆఫీసుగా అభివర్ణించిన వ్యాఖ్యల్ని  వెనక్కి తీసుకోవాలని సూచించారు. సభ్యుడి గొంతునొక్కే ప్రయత్నం చేస్తే.. చూస్తూ ఊరుకోన్నారు. తనకున్న అధికారాల మేరకే వంశీ మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్‌ విషయంలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ఆనాటి  ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 

 

ముఖ్యమంత్రిని కలవడంపై క్లారిటీ ఇచ్చారు వంశీ. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం జగన్‌ను కలిస్తే తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారన్నారు. సోషల్‌ మీడియాలో దూషిస్తూ పోస్ట్‌లు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సభలో టీడీపీ సభ్యులతో కలిసి కూర్చోలేనని చెప్పారు వంశీ. వంశీ అభ్యర్థన మేరకు.. ఆయన్ని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్లు తెలిపారు స్పీకర్‌. స్పీకర్ నిర్ణయంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. వంశీ రాజీనామా చేసి వైసీపీలో చేరాలని సూచన చేసింది. అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడిగా గుర్తించడంతో.. టీడీపీలో వంశీ ఎపిసోడ్‌ ముగిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: