ఏపీ అసెంబ్లీలో ఉల్లిపై చర్చ కాస్తా.. హెరిటేజ్ మీదకు మళ్లింది. హెరిటేజ్ చంద్రబాబుదా.. కాదా అనే అంశంతో పాటు గుడివాడ రైతుబజార్లో రైతు మృతిపైనా రచ్చ జరిగింది. రాష్ట్రం చంద్రబాబు జాగీరు కాదని కొడాలి నాని మండిపడితే.. హెరిటేజ్ రిటైల్ తమదేనని నిరూపించాలని చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసిరారు. 

 

ఏపీలో ఉల్లి ధరలపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సీఎం జగన్.. హెరిటేజ్ గురించి ప్రస్తావించడంతో.. రాజకీయ కాక రేగింది. రైతుబజార్లో కిలో ఉల్లి 25 రూపాయలకు ఇస్తున్నాం కాబట్టే.. క్యూలు ఉంటున్నాయని తెలిపారు ముఖ్యమంత్రి. చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కిలో ఉల్లిపాయలు 200 రూపాయలకు అమ్ముతున్నారని సెటైరేశారు. 

 

సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు వ్యతిరేకించారు. హెరిటేజ్ రిటైల్ తాము అమ్మేశామని చెప్పిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గుడివాడ రైతుబజార్ లో ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడ్డ రైతు చనిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు. హెరిటేజ్ రిటైల్ తనదేనని నిరూపించాలని చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు.  

 

చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో రైతు ఉల్లిపాయల కోసం చనిపోలేదనీ, ఆయనకు పదిహేనేళ్ల నుంచి గుండెనొప్పి ఉందని చెప్పారు. కూరగాయల కోసం రైతుబజారుకు వెళ్లి చనిపోతే.. దాన్ని కూడా ఉల్లి ధరలకు లింక్ పెడుతున్నారని ఆరోపించారు. ఏపీ చంద్రబాబు జాగీరు కాదని, గుడివాడలో నాని ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు మంత్రి కొడాలి. 

 

హెరిటేజ్ రిటైల్ అమ్మినప్పుడు చంద్రబాబు ఫ్యూచర్ గ్రూపులో షేర్లు వచ్చాయని.. అలాంటప్పుడు చంద్రబాబుకు షేర్ ఉన్నట్టా.. లేనట్టా అని ప్రశ్నించారు ఆర్థిక మంత్రి బుగ్గన. ప్రతి దానికీ చంద్రబాబు అంత ఆవేశపడాల్సిన అవసరం లేదని చురకంటించారు. హెరిటేజ్ గురించి పదేపదే అసెంబ్లీలో ప్రస్తావించడం సరికాదన్న చంద్రబాబు.. తాను కావాలనుకుంటే జగన్ ఫ్యామిలీ బిజినెస్ ల గురించి మాట్లాడగలనని హెచ్చరించారు. మరోవైపు హెరిటేజ్‌లో ఉల్లి రేట్లకు సంబంధించి తమకు సంబంధం లేని అంశమన్నారు నారా భువనేశ్వరి. హెరిటేజ్‌ సంస్థ ఫ్యూచర్‌ గ్రూప్స్‌కు సంబంధించినదని చెప్పారు. ఉల్లి రేట్లు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: