సమాజంలో రోజురోజుకూ క్రైం రేటు పెరిగిపోతోంది. మనిషి ఆలోచనలు రాను.. రాను క్రూరంగా మారిపోతున్నాయి. చివరికి సొంత మనుషులను కూడా చంపుకునేందుకు వెనుకాడడం లేదు. 

 

ప్రకాశం జిల్లాలో జరిగిన తల్లీ కూతుళ్ల హత్య కేసును ఛేదించారు పోలీసులు. భార్యతో పాటు కూతుర్ని హత్య చేసిన తర్వాత మృతదేహాలను నిందితుడు కోటి దగ్ధం చేసినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో కోటిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 3న పేర్నమిట్ట వద్ద తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. 

 

అత్తగారింటికి వచ్చిన  అల్లుడు అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలిపోయాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మడలం దూది వెంకటాపురంలో జరిగింది. భార్యాభర్యల మధ్య గొడవలతో నరేశ్‌ భార్య కొంతకాలంగా పుట్టింట్లోనే ఉంటోంది. భార్య కోసం అత్తగారింటికి వెళ్లిన నరేశ్‌ మంటల్లో కాలి చనిపోయాడు. భార్య తరపు బంధువులే నరేశ్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటించి చంపేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

 

కొడుకు చేసిన పనితో తమ పరువు పోయిందని భావించిన దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. దీంతో భర్త చనిపోగా, భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి పట్టణంలో ఈ ఘటన జరిగింది. తమ కొడుక్కి ఇటీవల ఓ యువతితో నిశ్చితార్ధం చేయించారు ధన్వంతరి, సుబ్బలక్ష్మి దంపతులు. అయితే... అతను ఫేస్‌బుక్‌లో  పరిచయమైన మరో యువతితో వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. కొడుకు పనితో తీవ్ర మనస్థాపానికి గురైన ధన్వంతరి, సుబ్బలక్ష్మి దంపతులు పురుగుల మందు తాగారు. 

 

తూర్పు గోదావరి జిల్లాలోని బొమ్మూరులో 20 ఏళ్ల  యువతి చిడిపి రాజశ్రీ అనుమాస్పద మృతి అలజడి రేపింది. అయితే ప్రియుడే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. మృతురాలి మెడపై గాయాలు ఉండడంతో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పనిమీద రాజశ్రీ కుటుంబ సభ్యులు బయటకు వెళ్లారు. తిరిగి వారు వచ్చేసరికి కూతురు విగతజీవిగా పడి ఉంది. యువతులపై అత్యాచారాలు, దాడులు పోలీసులకు సవాళ్లుగా మారాయి. మరోవైపు హత్య కేసులు సంచలనం సృష్టించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: