క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అధికార పార్టీ తరపున నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో గెలిచిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యవహార శైలి అలాగే అనిపిస్తోంది.  వెంకటగిరిలో గెలిచినప్పటి నుండి వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆనం తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.

 

జిల్లా రాజకీయాల్లోనే సీనియర్ అయిన తనకు మంత్రిపదవి ఖాయమని ఆనం అనుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అనీల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తనకన్నా జూనియర్లను మంత్రులుగా తీసుకోవటంతో పాటు తనను వెంకటగిరి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేయటాన్ని ఆనం తట్టుకోలేకపోతున్నారు. దాంతో  నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నారు.

 

ఆనం వ్యవహార శైలిని జగన్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. అసలు ఆనంను పార్టీలోకి తీసుకోవటమే అనవసరమని చాలామంది చెప్పారు. అయితే పార్టీలోకి తీసుకుంటే చాలని ఆనం అప్పట్లో  బ్రతిమలాడుకుంటే తీసుకోక తప్పలేదు. ఆనంను తీసుకున్న ఫలితాన్ని ఇపుడు జగన్ చూస్తున్నారు. సరే వైసిపి తరపున తాను పోటి చేయకుండా ఉండుంటే పరిస్ధితి మరోలాగుండేదన్న విషయాన్ని ఆనం మరచిపోయారు.

 

పార్టీలో జరుగుతున్న పరిణామాల విషయంలో ఆనం అసంతృప్తిని బిజెపి నేతలు గ్రహించారట. అందుకనే మెల్లిగా దువ్వుతున్నారు. ఇందులో భాగంగానే జాతీయ ముఖ్య నేతలతో ఆనం టచ్ లోకి వెళ్ళారట. తమ పార్టీలోకి వస్తే పార్టీలో  కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ కూడా లభించిందని సమాచారం. దాంతో కమలం గూటికి వెళ్ళే విషయాన్ని ఆనం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

దానికితోడు పార్టీలో ప్రాధాన్యత లేనపుడు వైసిపిలో కొనసాగటం అనవసరమని మద్దతుదారులు కూడా ఆనంతో స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి తమ కుటుంబం హవా నెల్లూరు జిల్లాలో అయిపోయిందన్న విషయాన్ని ఆనం మరచిపోయారు. ఒకపుడు జిల్లా మొత్తం మీద ఆనం చక్రం తిప్పినమాట వాస్తవమే. కానీ పరిస్ధితులు మారిపోయిన విషయాన్ని ఆనం మరచిపోయారు. పైగా బిజెపికి రాష్ట్రంలో దిక్కు దివాణం కూడా లేవు. ఆ పార్టీలోకి వెళితే అప్పుడు ఆనంకు వాస్తవమేంటో బోధపడుతుందేమో చూద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: