ఆర్థిక మాంద్యం ప్రభావంతో దేశవ్యాప్తంగా ఐటీ రంగంలోని ఉద్యోగాలతో పాటు ఇతర రంగాలలోని ఉద్యోగాలలో ఇప్పటికే ఉన్న ఉద్యోగులను భారీ సంఖ్యలో పీకేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తూ ఉండటంతో కొత్త ఉద్యోగాల నియామకాలు కూడా కష్టమేనని వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఒక సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రముఖ సంస్థ చేసిన సర్వేలో నిరుద్యోగులకు భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు పెరగనున్నట్టు తేలింది. 
 
టీమ్ లీజ్ అనే సంస్థ చేసిన సర్వేలో అక్టోబర్ - మార్చి కాలంలో కొన్ని సెక్టార్లలో ఉద్యోగ నియామకాలు పెరగనున్నట్టు తేలింది. ఆర్థిక సంస్కరణల వలన 19 సెక్టార్లలో 7 సెక్టార్లలో ఉద్యోగ నియామకాలు పెరిగినట్లు సంస్థ తెలిపింది. లాజిస్టిక్స్, పవర్ అండ్ ఎనర్జీ, కేపీవో, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, టెక్ స్టార్ట్ అప్స్, ఈ కామర్స్, ఐటీ, హెల్త్ కేర్ అండ్ ఫార్మాసూటికల్స్ లో ఉద్యోగ నియామకాలు భారీగా పెరగనున్నట్టు సంస్థ తెలిపింది. 
 
అగ్రికల్చర్ అండ్ అగ్రో కెమికల్స్, ఎఫ్ఎమ్ సీజీ, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, టెలీ కమ్యూనికేషన్స్, బీపీవో, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్ స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్, మ్యానుఫాక్టరింగ్ రంగాలలో మాత్రం ఉద్యోగ నియామకాలు పడిపోయాయని టీమ్ లీజ్ సంస్థ తెలిపింది. ఆర్థిక మందగమనం ప్రభావం వలన కొన్ని రంగాలలో ఉద్యోగ నియామకాలు తగ్గుతున్నా కొన్ని రంగాలలో నియామకాలు పెరుగుతూ ఉండటం గమనార్హం. 
 
2020 మార్చి నెల వరకు మెట్రో సిటీలైన కోల్ కతా, గూర్గావ్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణె, హైదరాబాద్, ముంబై నగరాలలో ఉద్యోగ నియామకాలకు ఎటువంటి సమస్యలు లేవని టీమ్ లీజ్ సంస్థ చెబుతోంది. నాగ్ పూర్, కొచ్చి, అహ్మదాబాద్, కోయంబత్తూర్, ఇండోర్ లలో మాత్రం ఉద్యోగ నియామకాల సంఖ్య భారీగా పడిపోయినట్లు సంస్థ చెబుతోంది. ఇండియాలో టీమ్ లీజ్ సంస్థ 744 చిన్న, మధ్యతరహా, పెద్ద కంపెనీలపై సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: